మాస్ సినిమాలు.. క్లాస్ సినిమాలు అనే తేడాను 'చెక్' చెరిపేస్తుందని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'చెక్'. ప్రియాప్రకాశ్ వారియర్, రకుల్‌ప్రీత్‌సింగ్ నటించారు. కల్యాణిమాలిక్ సంగీతం అందించారు. వి.ఆనందప్రసాద్ నిర్మాత. ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రిరిలీజ్ వేడుక ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి రాజమౌళి, యువ కథానాయకుడు వరుణ్‌తేజ్, డైరెక్టర్లు వెంకీ కుడుముల, గోపీచంద్ మలినేని హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. "ఇప్పుడు పాటలే జనాలను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ఈ చిత్రంలో ఉన్నది ఒక్క పాటే అయినా చాలా బాగుంది. ట్రైలర్ చూసిన తర్వాత ఎప్పుడు చూద్దామా అని అనిపించిన చిత్రం 'చెక్'. మాస్ సినిమా.. క్లాస్ సినిమా అవరోధాలను తొలగిస్తుందన్న నమ్మకం ఉంది. ఒకేరకమైన సినిమాలు చేస్తాడన్న అభిప్రాయాలను ఈ సినిమాతో నితిన్ చెరిపేస్తాడు" అని ఆయన అన్నారు.
నితిన్ మాట్లాడుతూ.. "నా కెరీర్లో ఎప్పటికీ మరిచిపోలేని హిట్ సినిమా 'సై'. అది కూడా క్రీడా నేపథ్యం ఉన్న చిత్రం. దాని తర్వాత మరోసారి క్రీడా నేపథ్యం ఉన్న ఈ సినిమా చేశాను. అసలు నటన అంటే ఏంటనేది చంద్రశేఖర్ యేలేటి నుంచి నేర్చుకున్నాను. ఈ సినిమా ఆయనకు కేవలం పేరు మాత్రమే కాకుండా డబ్బు కూడా తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా. మాకు అతి పెద్ద బలం కల్యాణి మాలిక్ ఇచ్చిన సంగీతం. సినిమా విడుదలైన తర్వాత ఆ విషయం అందరికీ తెలుస్తుంది. అందరూ బాగా కష్టపడి పని చేశారు' అని నితిన్ అన్నాడు. వరుణ్‌తేజ్ మాట్లాడుతూ.. "పెళ్లయిన తర్వాత ఎవరైనా నెమ్మదిస్తారు. కానీ నితిన్ మాత్రం సినిమాల స్పీడు పెంచాడు' అని అన్నారు.
ఇదీ చూడండి: పదేళ్ల నుంచి మనసులో ఉన్న ఆలోచనే 'చెక్'