అశ్లీల చిత్రాల వ్యాపారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా, ర్యాన్ తోర్పేలను .. మహారాష్ట్రలోని మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు. ఇంకా కీలక అంశాలు వెలుగులోకి రావాల్సి ఉందని, మరో ఏడు రోజులు వారికి కస్టడీకి కోరారు. దీనిపై స్పందించిన కోర్టు వారికి జులై 27 వరకు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అలాగే పోర్న్ చిత్రాల ద్వారా వచ్చిన డబ్బును ఆన్లైన్ బెట్టింగ్‌లకు ఉపయోగించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ వాట్సప్ చాట్‌లో 121 వీడియోలు 1.2 మిలియన్ డాలర్లకు అమ్మకానికి పెట్టినట్లు తెలిసిందని పేర్కొన్నారు. ఇది ఒక ఇంటర్నేషనల్ డీల్ అని.. ఈ విషయంలో కుంద్రాకు చెందిన యెస్ బ్యాంక్, యూనైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్రికా నగదు బదిలీలను పరిశీలించాలని నిర్ణయించామని వెల్లడించారు.
తప్పించుకునేందుకు లంచం!
అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్‌కుంద్రా.. పోలీసులకు భారీ మొత్తంలో లంచం ఇచ్చారని తెలుస్తోంది. ఈ విషయాన్ని అవినీతి నిరోధక శాఖ వెల్లడించింది. ఇదే కేసులో అరెస్టయిన యష్ ఠాకుర్ నుంచి తమకు నాలుగు ఈమెయిల్స్ వచ్చాయని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. రూ. 25 లక్షలు లంచం ఇచ్చినట్లు అందులో ఉందని తెలిపారు. వీటిని ముంబయి పోలీసులకు ఫార్వర్డ్ చేశామని, త్వరలో వారు దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారని వెల్లడించారు.