"మీ మనసులో మెదిలే భావాలతో హృదయం భారంగా ఉన్నప్పుడు కూడా మొహంపై చిరునవ్వు వస్తుంది" అంటున్నాడు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. తాను స్వయంగా కలం చేతపట్టి రచించిన '99 సాంగ్స్' పాటల ద్వారా ఇది సాధ్యమవుతుందన్నాడు. ఈ ఆల్బమ్‌ను మార్చి 20న లాంఛనంగా విడుదల చేశాడు రెహమాన్. తొలిసారిగా ఈ చిత్రానికి నిర్మాత, రచయితగా అతడే వ్యవరిస్తుండటం విశేషం. అయితే ఈ కొత్త బాధ్యతల నిర్వహణ చాలా సవాలుగా ఉందని ఈ ఆస్కార్ అవార్డు గ్రహీత అన్నాడు.
"ఒక చిత్రానికి సంగీతం మాత్రమే సమకూరుస్తున్నపుడు ఆలోచనలను పంచుకోవడానికి అనుభవం ఉన్న దర్శకుడు, పాటల రచయిత, నిర్మాత వంటి వారు ఉంటారు. కానీ ఈ చిత్రానికి నేనే రచయితను. రచయితలు రాసేవి నిర్మాతలకు నచ్చాలి. ఇక్కడ అది కూడా నేనే.. నేను ఓకే అన్నా దర్శకుడికి నచ్చకపోవచ్చు. అందుకే మేము ప్రతి పాటను మూడు నుంచి నాలుగు వెర్షన్లలో చేశాము. మేము పడ్డ కష్టానికి ఫలితం మీ ముందుకు రాబోతోంది. ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాం. ఇది చాలా చక్కని అనుభవం."
-ఏఆర్ రెహమాన్, ప్రముఖ సంగీత దర్శకుడు.
అంబానీకి చెందిన జియో స్టూడియోస్‌తో కలిసి రెహమాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. విశ్వేశ్ కృష్ణమూర్తి సహ రచయిత, దర్శకుడు కాగా.. హీరో హీరోయిన్లుగా కొత్తవారైన ఇహాన్ భట్, ఎడిల్సే వర్గాస్‌లు పరిచయం కానున్నారు. వీరితో పాటు సీనియర్ నటీమణులు మనీషా కొయిరాలా, లిసా రే కూడా 99 సాంగ్స్ చిత్రంలో నటిస్తున్నారు.