Radhe Shyam: డార్లింగ్ ప్రభాస్-పూజా హెగ్డే జంటగా నటించిన 'రాధేశ్యామ్'.. విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. విజువల్స్ పరంగా గ్రాండ్‌గా ఉన్నప్పటికీ ఒక వర్గం ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించలేకపోయింది! అయితే ఈ సినిమాపై ప్రేక్షకులు, క్రిటిక్స్ నుంచి వస్తున్న నెగిటివ్ కామెంట్స్‌పై చిత్ర దర్శకుడు రాధాకృష్ణ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ప్రేమ కథ నుంచి ఇంకేం ఆశిస్తారని వారిపై ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో అసహనం వ్యక్తం చేశారాయన.
"వెజిటేరియన్ హోటల్‌కు వెళ్లి.. చికెన్ బిర్యానీ పెడతారని ఎలా ఆశిస్తారు? 'రాధేశ్యామ్' ప్రేమకథ అని ముందు నుంచే చెబుతున్నాం. అయినా సినిమాలో యాక్షన్ లేదని విమర్శకులు అంటున్నారు. అందులో అర్థం ఉందా అసలు?"
- రాధాకృష్ణ, దర్శకుడు
అంతకుముందు ప్రభాస్ కూడా.. తన యాక్షన్ ఇమేజ్‌కు దూరంగా ఓ విభిన్నమైన సినిమా చేయాలనుకున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే 'రాధేశ్యామ్' అనే లవ్‌స్టోరీ వచ్చింది. ఇది ఒక పీరియడ్ రొమాంటిక్ డ్రామా. ఇందులో హస్తసాముద్రికా నిపుణుడిగా నటించారు ప్రభాస్. విధికి ప్రేమకు మధ్య యుద్ధం అనే నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.
కలెక్షన్లలో దూకుడు..
టాక్ ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది 'రాధేశ్యామ్'. మార్చి 11న ఈ చిత్రం విడుదల కాగా, మూడు రోజుల్లోనే రూ.151 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.
ఇదీ చూడండి: ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే