'ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్లూ తెచ్చింది'.. 'ఊహలు గుసగుసలాడే' సినిమాలోని ఈ పాటను వింటే వెంటనే గుర్తుకువచ్చేది హీరోయిన్ రాశీఖన్నా. బబ్లీ, బబ్లీగా కనిపించి తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ప్రేమ, కుటుంబ కథాచిత్రాల్లో నటించి, ప్రేక్షకులను మెప్పించింది. గతేడాది చివర్లో 'వెంకీమామ', 'ప్రతిరోజూ పండగే' చిత్రాలతో విజయాల్ని అందుకున్న ఈ భామ.. 'వరల్డ్ ఫేమస్ లవర్'తో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఈ సందర్భంగా విలేకర్లతో సరదాగా ముచ్చటించిందీ భామ. ఆ విశేషాలివే.
యామిని పాత్ర ఓ సవాలు
ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలతో పోలిస్తే 'వరల్డ్ ఫేమస్ లవర్'లో పోషించిన యామిని పాత్ర విభిన్నంగా ఉంటుంది. ఈ పాత్ర ఎమోషనల్‌గా ఒక సవాలుతో కూడుకున్నది. ఇప్పటివరకూ చేసిన పాత్రల కంటే దీనిని చాలా ఫీల్ అయ్యి చేశాను. ఒకవేళ నేను రిలేషన్‌లో ఉంటే ఎలా ఉంటాను. పరిస్థితులను ఎలా ఎదుర్కొంటాను అనే విషయాలను అనునయించుకుని ఈ పాత్రను పోషించాను. ఈ టీజర్ చూసి అభిమానులు నా పాత్ర గురించి బాధపడ్డారు. కానీ సినిమా చూశాక తప్పకుండా వాళ్లు హ్యాపీ ఫీలవుతారు.
తప్పకుండా సర్‌ప్రైజ్
ఈ సినిమా టీజర్ చూశాక చాలామంది ఇది 'అర్జున్‌రెడ్డి 2' లా ఉందంటూ కామెంట్లు చేశారు. కానీ ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ చూశాక.. ప్రతి ఒక్కరూ ఈ కథ గురించి ఒకే రకమైన ఆలోచనకు వచ్చారు. నేను చెప్పేది ఒక్కటే.. ఈ సినిమా చాలా విభిన్నంగా ఉంటుంది. తప్పకుండా ఓ సర్‌ప్రైజ్ ఉంటుంది. దానితోనే సినిమా పూర్తవుతుంది.
దర్శకుడు, హీరో భయపడ్డారు
ఈ సినిమాలో యామిని క్యారెక్టర్‌కు నేను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. చాలా సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు ఏడ్చేసేదాన్ని. నేను అలా ఏడవడం చూసి.. మా డైరెక్టర్ క్రాంతిమాధవ్‌తోపాటు హీరో విజయ్ భయపడ్డారు. యామిని పాత్రను ఫీల్ అయి చేయడం వల్లే కన్నీళ్లు వచ్చాయి అనుకుంటున్నా. పాత్రకు కనెక్ట్ అవ్వడం వల్లనే డబ్బింగ్ రెండు రోజుల్లోనే చెప్పేశాను. డబ్బింగ్‌కు వెళ్తున్నప్పుడు.. చెప్పగలనా? లేదా? అనిపించింది. కానీ బాగా చెప్పగలిగాను.
విజయ్‌తో చేయడం
విజయ్ చాలా మంచి వ్యక్తి. అతనితో కలిసి పనిచేయడం బాగుంది. ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్ చేశాను. ఏ పాత్రనైనా తను ఫీల్ అయ్యి చేస్తాడు. ఇటీవల విజయ్.. ఇదే తన చివరి లవ్ స్టోరీ అని ప్రకటించాడు. నాకు తెలిసినంత వరకూ తనకు మహిళా అభిమానులు ఎక్కువ. వాళ్లందరూ విజయ్‌ను ప్రేమకథా చిత్రాల్లోనే చూడడానికి ఇష్టపడుతుంటారు. అభిమానుల ఇష్టాన్ని దృష్టిలో ఉంచుకుని.. కొంతకాలం గ్యాప్ తీసుకుని మళ్లీ ప్రేమకథా చిత్రాల్లో విజయ్ నటిస్తాడని భావిస్తున్నాను.
ఆయన నుంచి చాలా నేర్చుకున్నా
క్రాంతిమాధవ్ చాలా మంచి వ్యక్తి, రచయిత. ఈ సినిమాలోని ప్రతి పాత్రను చాలా చక్కగా రాశారు. జీవితం అంటే ఏంటనే విషయాన్ని ఆయన నుంచి తెలుసుకున్నాను.
ఐశ్వర్య రాజేశ్ పాత్ర చేస్తా
ఒకవేళ నేను 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో యామిని పాత్ర కాకుండా వేరే పాత్రను ఎంచుకోవాల్సి వస్తే.. తప్పకుండా ఐశ్వర్యరాజేశ్ చేసిన పాత్రనే ఎంచుకుంటాను. ఎందుకంటే ఐశ్వర్య పాత్ర చాలా బాగుంటుంది. అలాగే తను అద్భుతంగా ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">