సినిమాలను ఓటీటీల్లో కాకుండా థియేటర్లలోనే విడుదల చేయాలని ప్రముఖ నిర్మాతలకు పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి విజ్ఞప్తి చేశారు. బుధవారం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. థియేటర్లు బాగుపడిన రోజే చిత్రసీమకు లాభాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఇటీవలే ఓటీటీలో విడుదలై 'నారప్ప' చిత్రాన్ని సాధారణ ప్రేక్షకుడు చూడలేకపోయాడని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
"భారతదేశంలో పేదవాడికి సరైన వినోదం దక్కడంలేదు. తెలుగు సినిమాలను ఓటీటీలో కాకుండా థియేటర్లలో విడుదల చేస్తే చిత్రసీమకు మంచి జరుగుతుంది. ఇటీవలే ఓటీటీలో విడుదలైన 'నారప్ప' చిత్రాన్ని కేవలం 25 శాతం మంది ప్రేక్షకులే చూడగలిగారు. మిగిలిన 75 శాతం మంది ప్రజలకు ఓటీటీ చూసే సౌకర్యం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పేదవాడికి వినోదం ఎలా దక్కుతుంది. థియేటర్లలో సినిమాను చూడడం అనేది ఒక పండుగలా ఉంటుంది. సినిమాహాళ్లలో చూస్తే ఆ అనుభూతే వేరు. కరోనా వైరస్‌తో మనం పోరాడుతూనే.. మనం జీవనం సాగించాలి. అదే విధంగా సినిమా కూడా బతకాలి. ఈ క్రమంలో పేదవాడికి వినోదం దూరం కాకుండా చూసుకోవాలి. సగటు పేదవాడికి ఉన్న వినోదం థియేటర్ల రూపంలోనే అందుతుంది. ఇరు రాష్ట్రాల్లోని థియేటర్లను తెరిచేందుకు అనుమతినివ్వాలని ముఖ్యమంత్రులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. సినీ పరిశ్రమ పెద్దలు కూడా సినిమాహాళ్లు తెరిచే విధంగా కృషి చేయాలని కోరుతున్నా. మనిషి ఉన్నంత కాలం థియేటర్లు ఉంటాయి. అవే లేకపోతే స్టార్‌డమ్‌లు ఉండవు. సినిమాలను ఓటీటీల్లో కాకుండా థియేటర్లోనే విడుదల చేయాలని చిత్రసీమ ప్రముఖులను కోరుతున్నా" అని ఆర్.నారాయణమూర్తి వెల్లడించారు.
ఇదీ చూడండి.. కృష్ణంరాజుకు లేఖ.. 'మా' ఎన్నికలపై రానున్న స్పష్టత!