కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్(46) హఠాన్మరణం. ఈయన మృతి పట్ల కన్నడ, తెలుగు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పునీత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ఉదయం ఏం జరిగిందంటే..!
రోజూ లాగే పునీత్ రాజ్‌కుమార్ వ్యాయామం చేయడం మొదలు పెట్టారు. ఉదయం 9.30 గంటల సమయంలో వ్యాయామం చేస్తున్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. గుండెలో నొప్పిగా ఉందని చెప్పడం వల్ల, ఆయన సిబ్బంది వెంటనే దగ్గర్లోని రమణశ్రీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కార్డియాక్ అరెస్ట్ అయినట్లు గుర్తించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం మరొక ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో పునీత్‌ను విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉండటం వల్ల వైద్యులు ఐసీయూకు తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అయితే, పరిస్థితి చేయి దాటిపోయింది. పునీత్ తుదిశ్వాస విడిచారు. కానీ ఈ విషయాన్ని వెంటనే ప్రకటించలేదు. సమాచారం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై, హోం మంత్రి హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. తర్వాత ఏం చేయాలన్న దానిపై చర్చించారు. పునీత్ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. పునీత్ అంత్యక్రియల గురించి ఈ సందర్భంగా చర్చించారు. రాజ్‌కుమార్ కుటుంబానికి సంబంధించిన కంఠీరవ స్టూడియోలో పునీత్ అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
పునీత్ రాజ్‌కుమార్ మృతి పట్ల కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. థియేటర్లను కూడా మూసేశారు. అభిమానులు, సినీ ప్రముఖులు ఆస్పత్రికి భారీగా చేరుకుంటున్నారు.
బాలనటుడి నుంచి హీరోగా
2002లో 'అప్పు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు పునీత్. అప్పటి నుంచి ఈ కథానాయకుడిని ఫ్యాన్స్ 'అప్పు' అని పిలవడం ప్రారంభించారు. అభి, వీర కన్నడిగ, అజయ్, అరసు, రామ్, హుదుగురు, అంజనీపుత్ర తదితర సినిమాలతో హిట్లు కొట్టి అభిమానుల మనసుల్లో పునీత్ రాజ్‌కుమార్ చెరిగిపోని స్థానం సంపాదించారు. ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన 'యువరత్న' సినిమాలో చివరగా కనిపించారు. ఈ చిత్రం తెలుగులోనూ విడుదలై ఆదరణ దక్కించుకుంది. నటుడిగానే కాకుండా సింగర్‌గాను అభిమానుల్ని అలరించారు పునీత్. అలానే గాయకుడిగా పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పునీత్ నటిస్తున్న రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.