"జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. చిత్ర పరిశ్రమపై కరోనా ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేం"అంటున్నారు ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించడమేకాదు చిత్ర పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఆయన సొంతం. కరోనా కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌తో ప్రస్తుతం సినీ రంగం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో తన రోజువారీ జీవితం, చిత్ర పరిశ్రమ తీరు తెన్నులపై ‘ఈనాడు- ఈటీవీ’తో సురేష్‌బాబు ముచ్చటించారు.
మీ జీవితంలో చాలా రోజుల తర్వాత పూర్తి సమయం కుటుంబానికి కేటాయించే పరిస్థితి వచ్చింది కదా. రోజువారీ జీవితం ఎలా సాగుతోంది?
రిటైర్‌మెంట్ తర్వాత చేయాల్సినవన్నీ ఇప్పుడు చేసేస్తున్నా. కొన్నేళ్ల ముందే విరమణ తీసుకుని విశ్రాంతిగా గడుపుదామని అనుకునేవాణ్ని. కుదరలేదు. ఇప్పుడు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం కేటాయించే అవకాశం వచ్చింది. ఇంట్లో అంతా సంతోషంగా ఉన్నాం. రోజూ వ్యాయామం చేయడం, స్నేహితులతో మాట్లాడటం, టీవీ చూడటం, పుస్తకాలు చదవడం, యోగా చేస్తున్నా. అలాగే సమాజం, పరిశ్రమ ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట పరిస్థితుల గురించి ఆలోచిస్తే బాధేస్తోంది. మంచి పరిష్కారం కోసమే నా ఆలోచన.
'బి ద రియల్‌మేన్' ఛాలెంజ్‌లో భాగంగా మీ సోదరుడు వెంకటేష్ ఇంటిపని, వంటపని, తోటపని చేశారు. అలా మీరు కూడా చేస్తుంటారా?
నేను కూడా తోటపని, ఇంటి పనులు చేస్తున్నా. మేం బాగానే వండుకుంటున్నాం. వంట గదిలోకి రావొద్దని ఇంట్లోవాళ్లు అంటున్నారు (నవ్వుతూ). వంట పనిలో నా అర్థాంగికి మా అబ్బాయి అభిరామ్ సహాయపడుతున్నాడు. వంట చేస్తున్నాడు. నేను మాత్రం వాళ్లు చేసినవి తింటున్నా.
రానా ఏం చేస్తున్నారు?
ఇంట్లోనే ఉన్నాడు. కొత్త ఆలోచనలతో బిజీగా ఉన్నాడు. ఆన్‌లైన్‌లో కొత్త ప్రాజెక్టులపై దృష్టి సారించాడు. ఈమధ్యే ఒక టీవీ షో చేశాడు. ఒకట్రెండు వారాల్లో ప్రసారం కావొచ్చు.
కరోనాకి ముందు... కరోనా తర్వాత అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. లాక్‌డౌన్ ఎత్తేశాక సినిమా నిర్మాణంపై ఆ ప్రభావం ఎలా ఉండబోతుంది?
పాక్షికంగా లాక్‌డౌన్ ఎత్తేసినా... సినిమా థియేటర్లు తెరవరు. ఒకవేళ షూటింగ్‌లు జరిగే అవకాశం ఉంటే భౌతికదూరం పాటిస్తూ చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. టీవీ న్యూస్ ఎలా చేస్తున్నారో అలా సినిమా షూటింగ్‌లు జరుగుతాయి. డబ్బింగ్, మ్యూజిక్ రికార్డింగ్ లాంటి పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుగుతాయి. లాక్‌డౌన్ ఎత్తేశాకా సినిమా పరిశ్రమ సాధారణ స్థితికి వస్తుంది.
ఈ పరిస్థితుల్లో నటులు, దర్శకులు పారితోషికాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందా?
ఏ వ్యాపారమైన సరే లాభసాటిగా ఉంటే సమస్య ఉండదు. వ్యాపారంలో లాభాలు లేనప్పుడు నటులు, దర్శకులు..ఎవరైనా కొన్ని వదులుకోవాలి. సినిమా పరిశ్రమ మనుగడ కోసం ఇక నుంచి పొదుపు చర్యలు తప్పకుండా పాటించాలి. ఇంతకుముందే చేసి ఉండాల్సింది. ఇప్పుడు వందశాతం పక్కా ప్రణాళికతో తక్కువ సమయంలో ప్రభావవంతంగా సినిమా నిర్మాణం పూర్తి చేసే అంశాలపై దృష్టి సారించాలి. ధైర్యంతో ముందుకు వెళ్లడం అలవాటు చేసుకోవాలి.
సినీ పరిశ్రమను నమ్ముకున్న కార్మికుల జీవితాలు ఇబ్బందులో పడ్డాయి. ఈ విపత్కర పరిస్థితిని పరిశ్రమ ఎలా అధిగమించగలదు?
పరిశ్రమ నుంచి గత నెల నిత్యావసర సరకులు అందించాం. ప్రభుత్వం, పరిశ్రమ శక్తి మేరకు చేస్తున్నాం. దీన్ని జీవితాంతం కొనసాగించలేం. అందరూ నైపుణ్యాలు పెంచుకోవాలి. కొత్త పద్ధతుల్లో పనులు అలవాటు చేసుకోవాలి. కుటుంబ పోషణకి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపైనా ఆలోచన చేయాలి.
ఓటీటీ వల్ల థియేటర్ల పరిస్థితి ఏంటి? ప్రేక్షకుల ఆదరణ గతంలాగే ఉంటుందా?
ఐటీ సహా పలు కంపెనీలు పొదుపు చర్యలు చేపట్టాయి. ఇంటర్నెట్ సౌకర్యంతో ‘వర్క్ ఫ్రం హోం’ విధానం అమలు చేస్తున్నాయి. ఇది లాక్‌డౌన్ తర్వాత కూడా కొనసాగితే సినిమా వ్యాపారానికి మంచి భవిష్యత్ ఉంటుంది. అందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇళ్లలోనే ఉంటారు. సాయంత్రం వేళ సినిమాలు, రెస్టారెంట్లు, పార్కులకు వెళ్లాలనుకుంటారు. ఆ కోణంలో సినిమాలకు మళ్లీ ‘స్వర్ణయుగం’ వచ్చే అవకాశం ఉంటుంది. కార్యాలయాలకు వెళ్లి పనిచెయ్యాల్సిన పరిస్థితి కొనసాగితే పెద్ద సినిమాలు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి చూసే సినిమాలకు థియేటర్లలో ఆదరణ ఉంటుంది. మిగిలిన చిత్రాలను ఓటీటీలోనే చూస్తారు.
మీరు కూడా వెబ్ సిరీస్‌లు నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు ఉన్నారు..
వెబ్ సిరీస్‌ల కోసం కథలు సిద్ధం చేస్తున్నాం. ఓటీటీ వేదికలతో చర్చిస్తున్నాం. అలాగని సినిమాను వదిలేది లేదు. సినిమాల్లోనే గ్లామర్ ఉంటుంది. ఎవరైనా సరే సినిమా దర్శకులు కావాలనే ఈ రంగంలోకి వస్తారు.
'నారప్ప', 'హిరణ్యకశ్యప' ప్రాజెక్టులు ఎక్కడి వరకు వచ్చాయి?
'నారప్ప' 25శాతం చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. 'హిరణ్య కశ్యప' పూర్వ నిర్మాణ పనుల్లో ఉంది. 'విరాటపర్వం' ఏడెనిమిది రోజులు.. రవిబాబుతో నిర్మిస్తున్న 'క్రష్' ఐదారు రోజుల పనులు మిగిలి ఉన్నాయి. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ పూర్తి చేశాం. మే 1న విడుదల చేయాలనుకున్నాం. ఆ చిత్రం విడుదల థియేటర్లోనా? ఓటీటీలోనా? అనేది చూడాలి.
మీ ఇంటి హీరోలు వెంకటేశ్, నాగచైతన్యలతో 'వెంకీమామ' తీశారు. వెంకటేశ్, రానా, నాగచైతన్యలతో మల్టీస్టారర్ వచ్చే అవకాశం ఉంటుందా?
ఎవరైనా మంచి కథ ఇస్తే లాక్‌డౌన్ తొలగించాక ప్రారంభిస్తాం. అలాంటి కథ కోసమే ఎదురు చూస్తున్నాం.
కరోనా ప్రభావాన్ని ఇతర భాషా చిత్ర పరిశ్రమలు ఎలా ఎదుర్కొనబోతున్నాయని భావిస్తున్నారు?
అన్ని చోట్లా కరోనా ప్రభావానికి అనుగుణంగా ప్రణాళికలు ఉంటాయి. ప్రభావం తగ్గి, మూడు నుంచి ఆరు నెలలకు వాక్సిన్ వస్తే ఓ ప్రణాళిక. ఏడాది, రెండేళ్లకు వస్తే మరో మార్గం. మూడేళ్లయినా రాకపోతే ఇంకో రకంగా సిద్ధం కావాలి. ఏ, బీ, సీ, డీ ప్లాన్లు సిద్ధం చేసుకోవాలి. లాక్‌డౌన్ పాక్షికంగా ఎత్తివేస్తే ఓటీటీ ద్వారా విడుదల చేసుకునే, తక్కువ నటులతో చేసే చిన్న చిత్రాలపై ఆలోచన ఉంటుంది. కొంతమందికి ఉపాధి, అవకాశాలు దొరుకుతాయి. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేసిన తర్వాత కొంతమేర నిర్మాణం మిగిలి ఉన్న సినిమాల్ని పూర్తిచేస్తారు. కొన్ని చిత్రాల్ని విజువల్ ఎఫెక్ట్స్‌తో పూర్తి చేసేందుకు పరిశీలిస్తారు. ఇవన్నీ వాక్సిన్ ఎప్పుడొస్తుందనే దానిపై ఆధారపడి ఉంటాయి.