"కృష్ణ అండ్ హిస్ లీలా' చిత్రం రెగ్యులర్ కథతో రూపొందిందే అయినా ఆ కథను నేటి తరానికి తగ్గట్లు కొత్త ట్రీట్‌మెంట్‌తో తెరకెక్కించారు. అందుకే ఈ చిత్రానికి ప్రతిఒక్కరూ చక్కగా కనెక్ట్ అవుతున్నారు" అన్నారు నిర్మాత డి.సురేష్‌బాబు. ఆయన నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన చిత్రమిది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రవికాంత్ పేరేపు తెరకెక్కించారు. రానా సమర్పించారు. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం.. జులై 4 నుంచి 'ఆహా' ఓటీటీలోనూ రానుంది. ఈ సందర్భంగా సోమవారం ఆన్‌లైన్ ద్వారా మీడియాతో ముచ్చటించారు సురేష్‌బాబు.
'కృష్ణ అండ్ హిస్ లీలా' కథ ఎంపిక రానాదా? మీదా?
నాది కాదు రానాదే. ఈ ప్రాజెక్టు అనుకున్నాక 'ఎందుకు దీన్నే ఎంచుకున్నావని' తనని అడిగా. దానికి తను 'మా ఫ్రెండ్స్‌లో చాలా మంది కృష్ణ చేసిన పనినే చేస్తున్నారు. నేటితరం యువతకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంద'ని చెప్పాడు.
'హిరణ్య కశ్యప' మీ బ్యానర్‌లో భారీ బడ్జెట్ చిత్రంగా రాబోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బడ్జెట్ ఏమన్నా తగ్గించబోతున్నారా?
కొన్ని కథలకు ఏం చెయ్యాలో.. ఎంత ఖర్చు పెట్టి చూపించాలో అలాగే చెయ్యాలి. రాజీ పడి స్క్రిప్ట్‌లోనూ, బడ్జెట్‌లోనూ మార్పులు చెయ్యకూడదు. ఇలాంటి చిత్రాలన్నీ ప్రేక్షకులను థియేటర్లకు తిరిగి రప్పించేవి. కాబట్టి వాటిని ఆ స్థాయిలోనే చూపించాలి.
సొంతంగా ఓటీటీ పెట్టే అవకాశముందా?
అది ఖర్చుతో కూడిన వ్యవహారం. పెట్టుబడికి తగ్గట్లుగా రాబడి రావడానికి ఓపిగ్గా ఎదురుచూడాలి. మేం ఓటీటీల్లోకి వస్తామో లేదో వేచి చూడాల్సిందే.
మీ రెండో అబ్బాయి అభిరామ్ తెరంగేట్రం ఎప్పుడు?
ఎప్పుడనేది కచ్చితంగా ఏం చెప్పలేం. ప్రస్తుతానికైతే వాడి కోసం కొన్ని కథలు సిద్ధమవుతున్నాయి.
భవిష్యత్తులో మిమ్మల్ని దర్శకుడిగా చూసే అవకాశమేమైనా ఉందా?
అసలీ ఈ కరోనా పరిస్థితుల్ని చూస్తుంటే మళ్లీ చిత్రాలు నిర్మిస్తామో? లేదో? అన్న భయాలు కలుగుతున్నాయి. ఇంకా దర్శకత్వం కూడానా?. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి ఎప్పుడు బయటపడతాం. అసలిది ఎప్పటికి అదుపులోకి వస్తుంది? అన్నది ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఏదైనా ఈ కరోనా ప్రభావం నుంచి బయట పడే వరకు చిత్ర పరిశ్రమతో పాటు అన్ని రంగాలకు ఇబ్బందుల తప్పవు.
రానా పెళ్లి పనులు ఎంత వరకు వచ్చాయి?
ఒకప్పుడంటే పెళ్లంటే చాలా హడావుడి ఉండేది. ఎంత మందిని పిలవాలి. ఎన్ని కార్డులు పంచాలి అని ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ నియమ నిబంధనలకు తగ్గట్లుగా పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్యే చేసుకోవాల్సి ఉంది. కాబట్టి పెద్దగా హడావుడి ఏమీ లేదు. ప్రస్తుతానికి చిన్న చిన్న పనులేవో జరుగుతున్నాయి.