వాల్మీకి రామాయణాన్ని తెరకెక్కించనున్నట్లు నిర్మాతలు మధు మంతెన, అల్లు అరవింద్, నమిత్ మల్హోత్రా రెండేళ్ల క్రితమే ప్రకటించారు. కరోనా సంక్షోభం కారణంగా ఈ ప్రాజెక్టు పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్‌ను త్వరలోనే మొదలుపెడతామని నిర్మాతల్లో ఒకరైన మధు మంతెన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం ప్రధాన తారగణాన్ని ఎంపిక చేస్తున్నట్లు తెలిపిన ఆయన ఈ ఏడాది చివరికి నటీనటుల వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు.
"ఇందులో నటించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నటీనటులతో మంతనాలు జరుపుతున్నాం. వారు ఈ ప్రాజెక్టులో నటించేందుకు అంగీకరిస్తారని ఆశిస్తున్నాం. ప్రస్తుతం నటీనటుల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ ఏడాది చివరికి ఇందులో నటించే వారి వివరాలను ప్రకటిస్తాం. రామాయాణ ప్రాముఖ్యాన్ని మన తరాలకు తెలియజేసేందుకు చేసే మా ప్రయత్నమే ఈ సినిమా. ఇలాంటి అవకాశం మాకు రావడం ఎంతో అదృష్టం. వాల్మీకి రాసిన కథను చెప్పేందుకు ఇదే సరైన సమయం. ఉదాహరణగా చెప్పాలంటే 'మంగళయాన్' సినిమా ఒకటి. తక్కువ ఖర్చుతో ప్రపంచస్థాయి శాటిలైట్స్‌ను తయారు చేయడం ఎలా అని ఆ సినిమా ద్వారా చూపించగలిగారు. ఇప్పుడు ప్రపంచానికి మన కథను చెప్పబోతున్నాం. కానీ, ఈ కథ మన దేశంలో పుట్టిందే".
- మధు మంతెన, నిర్మాత
మహేశ్, హృతిక్ కలిసి..
ఈ ప్రాజెక్టులో నటించేందుకు తెలుగు సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌ను సంప్రదించినట్లు చిత్రసీమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు కరీనా కపూర్, దీపికా పదుకొణెను కీలకపాత్రల కోసం ఎంపికచేసినట్లు తెలుస్తోంది. 'దంగల్' ఫేం నితిష్ తివారి, 'మామ్' ఫేం రవి ఉద్యవార్ కలిసి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, నమిత్ మల్హోత్రా, మధు మంతెన సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
బడ్జెట్ ఎంతంటే?
ఈ సినిమాతో రామాయణ ఇతిహాసాన్ని పూర్తి 3డీలో చూపించబోతున్నారు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందించనున్నారు. అందుకోసం అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు ఉన్న హృతిక్ రోషన్‌ను రాముడి పాత్ర కోసం ఎంపిక చేసుకుందట చిత్ర బృందం. అయితే మహేశ్ బాబును ఏ పాత్ర కోసం సంప్రదించారో తెలియాల్సిఉంది. ఇప్పటికే ఈ దిశగా చర్చలు కూడా షురూ చేసినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. దీనిపై ఈ ఏడాది చివరికి స్పష్టత రానుంది.
ఇదీ చూడండి.. దర్శకుడు రాజమౌళి.. 'రామాయణం' తీయాలి!