లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను రెండో విడతగా ఆదుకునేందుకు చిరంజీవి నేతృత్వంలోని కరోనా క్రైసిస్ కమిటీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు సమకూరిన సుమారు 8 కోట్ల రూపాయల నిధుల నుంచి తొలివిడతగా 14 వేల మంది కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయగా.. జూన్ లోనూ వంటసరుకులు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసంలో సీసీసీ కమిటీ సభ్యులు సి.కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్, మెహర్ రమేష్, బెనర్జిలు సమావేశమై చిరంజీవితో చర్చించారు.
తొలివిడతలో నిత్యావసర సరుకులు అందని సినీ కార్మికులను గుర్తించి స్వయంగా అందజేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అలాగే ఇతర కార్మికులను కూడా ఆదుకోవాలని తీర్మానించారు. మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సీసీసీ ప్రతినిధులు సి.కల్యాణ్, తమ్మారెడ్డి, బెనర్జీలు తెలిపారు.
అలాగే సినిమా చిత్రీకరణల అనుమతులపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న వేళ దుమారం రేపిన బాలకృష్ణ వ్యాఖ్యలను సీసీసీ కమిటీ సభ్యులు ఖండించారు. బాలకృష్ణ అలా మాట్లాడి ఉండాల్సింది కాదని అభిప్రాయపడిన నిర్మాత సి.కళ్యాణ్.. ముఖ్యమంత్రి సూచనల మేరకే చిరంజీవి, నాగార్జున నేతృత్వంలో మంత్రి తలసానితో సమావేశమైనట్లు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : 'మలర్‌గా నన్ను వారి గుండెల్లో ఉంచేసుకున్నారు'