Priyanka Jawalkar Gamanam: "ఆచితూచి సినిమాలు చేస్తూ ఉంటే కెరీర్ నెమ్మదిస్తుందనే భయం నాకూ ఉంది. అలాగని వచ్చిన సినిమాలన్నీ ఫటాఫట్ చేస్తూ పోతే.. వరుస పరాజయాలు ఎదుర్కోక తప్పదు. అందుకే ఆలస్యమైనా.. మనసుకు నచ్చిన కథలే ఒప్పుకోవాలని నిర్ణయించుకున్నా" అంటోంది నటి ప్రియాంకా జవాల్కర్. ఇటీవలే 'తిమ్మరుసు', 'ఎస్.ఆర్.కళ్యాణమండపం' చిత్రాలతో పలకరించిన ఈ భామ.. ఇప్పుడు 'గమనం'తో మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. సుజనా రావు తెరకెక్కించిన చిత్రమిది. శ్రియ ప్రధాన పాత్రలో నటించింది. ప్రియాంకకు జోడీగా శివ కందుకూరి నటించారు. ఈ సినిమా ఈనెల 10న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర విశేషాలను తెలిపింది ప్రియాంక.
"మనసులకు హత్తుకునే ఓ ఆసక్తికర కథాంశంతో సుజనా రావు ఈ సినిమాను తెరకెక్కించారు. దీనికోసం నన్ను తొలుత నిర్మాత జ్ఞానశేఖర్ సంప్రదించారు. ఓ ముస్లిం యువతి పాత్ర ఉంది చేయాలన్నారు. ఆ పాత్ర కోసం బుర్ఖా వేసి లుక్ టెస్ట్ చేశారు. అన్నీ సరిగ్గా కుదరడం వల్ల నన్నిందులోకి తీసుకున్నారు. ఇందులో నా పాత్ర పేరు జారా. నా పాత్రకు ఎక్కువ సంభాషణలు ఉండవు. నటనకు చాలా ఆస్కారముంది. కళ్లతోనే హావభావాలు పలికించాల్సి ఉంటుంది. అదే నాకు కాస్త సవాల్‌గా అనిపించింది".
"నేనీ సినిమా కన్నా ముందు చాలా కమర్షియల్ కథలు విన్నాను. ఏదీ అంతగా నచ్చలేదు. 'గమనం' కథ వినగానే నచ్చేసింది. 'వేదం' సినిమాలా ఉందనిపించింది. దీనికి తోడు ఇళయరాజా సంగీతమందిస్తున్నారని తెలియగానే.. ఈ అవకాశం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని నిర్ణయించేసుకున్నా. లేడీ డైరెక్టర్ కావడం వల్ల సుజనాతో ఎక్కువగా కనెక్ట్ అయ్యాను".
"ఇందులో నేను శివ కందుకూరికి జోడీగా కనిపిస్తా. తను క్రికెటర్ కావాలని కలలు కంటుంటే.. నేనతన్ని ప్రేమిస్తూ తిరుగుతుంటా. మా ప్రేమకథ చాలా కొత్తగా, మనసులకు హత్తుకునేలా ఉంటుంది. మా కథలో ఓ చిన్న సందేశమూ కనిపిస్తుంది. నిజానికి శివతో గతంలో 'చూసీ చూడంగానే' సినిమా చేయాల్సింది. కొన్ని కారణాల వల్ల అది మిస్సయింది. తర్వాత ఓ చిత్రం అనుకున్నా.. అదీ అలాగే చేజారింది. మొత్తానికి ఈ 'గమనం'తో మా జోడీ సరిగ్గా కుదిరింది".
Priyanka Jawalkar on Bold characters: " 'టాక్సీవాలా' విజయాన్ని సరిగ్గా వాడుకోలేకపోయానని కొందరు అంటుంటారు. నిజానికి నాకూ ఇదే అనిపిస్తుంది. కానీ, విధిని మనం మార్చలేం కదా. కొన్ని చిత్రాలు మనకు వద్దనుకున్నా వస్తాయి. ఇంకొన్ని చేయాలని తాపత్రయ పడినా చేజారుతుంటాయి. నాకు అందరు హీరోలతో కలిసి నటించాలనుంది. కథ మనసుకు నచ్చి.. నటనకు ప్రాధాన్యముంటే ఎలాంటి పాత్ర పోషించడానికైనా సిద్ధమే. అలాంటప్పుడు బోల్డ్ క్యారెక్టరైనా చేస్తాను. ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నా."
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'ఆ హీరో కోసమే కథ వినకుండా ఓకే చెప్పేశా!'