81 ఏళ్ల వయస్సులో గిరీష్ కర్నాడ్ అనారోగ్యంతో... బెంగళూరులో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ. ఓ గొప్ప సాహిత్య, కళా నైపుణ్యం ఉన్న వ్యక్తిని దేశం కోల్పోయిందని అభిప్రాయపడ్డారు కోవింద్.
" గిరీష్ కర్నాడ్ చనిపోయారన్న వార్త బాధాకరం. భారత చలనచిత్ర రంగానికి ఆయన ఒక మార్గనిర్దేశకుడు. సాహిత్యం పట్ల కృషి చేసిన వ్యక్తిని కోల్పోయాం. ఆయన కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నాను ".
-- రామ్‌నాథ్ కోవింద్, భారత రాష్ట్రపతి
భారతీయ భాషల్లో ఆయన ఎనలేని ప్రతిభ చూపారని మోదీ గుర్తుచేసుకున్నారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు గిరీష్‌కు నివాళులు అర్పిస్తున్నారు. సినీ, సాహితీ రంగానికి తీరని లోటని.. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

- 1938లో మే 19న మహారాష్ట్రలోని మథేరన్ ప్రాంతంలో జన్మించారు గిరీష్. నలభై ఏళ్ల సినీ కెరీర్‌లో నటుడిగా, దర్శకుడిగా, రచయితగా ఎంతో పేరు తెచ్చుకున్నారు.
- తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి మెప్పించిన ఆయనకు ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్ అవార్డుతో పాటు పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులు వచ్చాయి. నాలుగు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు.
- తెలుగులో 'ధర్మచక్రం', 'శంకర్‌దాదా ఎంబీబీఎస్', 'కొమరం పులి' చిత్రాల్లో నటించారు. ఆయన ఎక్కువగా కన్నడ, హిందీ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు.
- గిరీష్ చివరిగా నటించిన చిత్రం 'అప్నా దేశ్'. కన్నడలో తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 26న విడుదల కాబోతోంది.