'బాహుబలి' సినిమా తర్వాత ఒత్తిడి చాలా ఎక్కువైందని అంటున్నాడు హీరో ప్రభాస్. భారీ బడ్జెట్తో తెరకెక్కిన 'సాహో'లో కథానాయకుడిగా నటించాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రచారంలో భాగంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు రెబల్ స్టార్. అయితే తాను నటించిన 'బాహుబలి'ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పాడు.
"నేను నటించిన బాహుబలిని ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సినిమాతో నాకు అభిమానులు చాలా మంది ఏర్పడ్డారు. వారిలో ఎవరు ఎక్కువగా నచ్చారు అంటే చెప్పడం కష్టం. గుజరాత్లో కొందరు పిల్లలు బాహుబలిలో పాటల్ని పాడుతున్నారని నా స్నేహితుల్లో ఒకరు చెప్పారు. అది విని చాలా ఆనందమేసింది. ఇప్పుడు నా సినిమా వస్తోంది అంటే ఒత్తిడి ఎక్కువవుతోంది. తలచుకుంటేనే నిజంగా భయమేస్తోంది. త్వరలో రానున్న 'సాహో' కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను." -ప్రభాస్, కథానాయకుడు
అందరూ తనను గుర్తించాలనే కోరిక ఒకప్పుడు ఉండేదని, 'బాహుబలి'తో అది నెరవేరిందని చెప్పాడు ప్రభాస్.
"దేశం మొత్తం ఇప్పుడు నన్ను గుర్తుపడుతున్నారు. ప్రపంచంలోనూ కొన్నిచోట్ల అభిమానిస్తున్నారు. నిజంగా కల నెరవేరిందా అనిపిస్తోంది. ఇప్పటివరకు ఎన్నోసార్లు ముంబయి వెళ్లాను. అప్పుడు ఎవరు గుర్తుపట్టేవారు కాదు. కానీ ఇప్పుడు నేను వాళ్లకు తెలుసు. ఓ తెలుగు నటుడికి ఇది చాలా గొప్ప విషయం " -ప్రభాస్, కథానాయకుడు
'బాహుబలి' సిరీస్ను పూర్తి చేసేందుకు ఐదేళ్లు తీసుకున్న ప్రభాస్.. యాక్షన్ థ్రిల్లర్ 'సాహో' కోసం రెండేళ్లు వెచ్చించాడు. తనకు స్క్రిప్ట్ నచ్చితే, షూటింగ్ కోసం ఎన్నాళ్లయినా డేట్స్ ఇస్తానని చెప్పాడు.
"సాహోను ఏడాదిలో పూర్తి చేయాలని అనుకున్నాం. కానీ యాక్షన్ సన్నివేశాల్లో నాణ్యత కారణంగా ఆ సమయం కాస్త పెరిగింది. అయితే ఇప్పుడు ఎక్కువ సినిమాల్లో నటించేందుకు ప్రయత్నిస్తా. గత ఆరేళ్లలో నేను తీసినవి మూడు చిత్రాలే. అందుకే ఇప్పటి నుంచి సంవత్సరానికి ఒకటైనా విడుదల చేయాలని అనుకుంటున్నా. " -ప్రభాస్, కథానాయకుడు
'సాహో'లో శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటించింది. నీల్ నీతేశ్ ముఖ్, జాకీష్రాఫ్, అరుణ్ విజయ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుజీత్ దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందీ సినిమా.
ఇది చదవండి: హిందీ షోలో ప్రభాస్ డ్యాన్స్.. నెట్టింట ఫొటో వైరల్