ఇప్పుడంతా అమెరికా గోలే. పిల్లల్ని బీటెక్ చదివించడం, అమెరికా పంపడం - తల్లిదండ్రుల కలలన్నీ వీటి చుట్టూనే తిరుగుతున్నాయి. డాలర్ల ఆశతో అమెరికా విమానం ఎక్కాలని నవతరం కూడా ఎన్నో ఆశల్లో బతుకుతోంది. అమెరికా మోజులో ఏం కోల్పోతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. డాలర్ల వేటలో సంతోషం లేదని, తల్లిదండ్రుల వృద్ధాప్యంలో వాళ్ల బాగోగులు చూసుకోవడం, వాళ్లకు చేయూతనివ్వడంలోనే అసలైన సంతోషం ఉందని పిల్లలు గ్రహించడం లేదు. తమ పిల్లల్ని అమెరికా పంపడంలో ఉన్న ఆనందం కంటే, తమకు అత్యవసరమైనప్పుడు పక్కన ఉండడంలోనే ఎక్కువ సంతోషం ఉందని పెద్దలూ తెలుసుకోవడం లేదు. ఈ రెండు విషయాల్నీ తెలియజెప్పే ప్రయత్నమే... ఈ ప్రెజర్ కుక్కర్. మరి ఈ చిత్రం ఎలా ఉంది? అమెరికా వెళ్లాలని కలలు కనే వాళ్లకు ఏం సందేశం ఇస్తోంది?
కథేంటంటే: కిషోర్ (సాయిరోనక్)కు అమెరికా వెళ్లాలని ఆశ. తన గురించి కాదు. నాన్న కోసం. అమెరికా మ్యాప్ చూపించి... అక్కడి రాష్ట్రాల గురించి, దేశ విశేషాల గురించి చిన్నప్పటి నుంచీ పూస గుచ్చినట్టు చెబుతూ.. అమెరికా వెళ్లాలన్న కోరికని మనసులో నాటుకుపోయేలా చేస్తాడు నాన్న. అందుకే కిషోర్ కూడా అమెరికా వెళ్లాలని డిసైడ్ అయిపోతాడు. కానీ, వీసా మాత్రం కాదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా రిజెక్ట్ అవుతుంటుంది. బ్రోకర్‌ని నమ్మి పాతిక లక్షలు పోగొట్టేస్తాడు కిషోర్. దాంతో తండ్రి తల్లడిల్లిపోతాడు. ఎలాగైనా సరే.. పోగొట్టిన ఆ డబ్బుని ఇండియాలోనే సంపాదించి ఇస్తానని ఛాలెంజ్ చేస్తాడు కిషోర్. మరి ఆ తరవాత ఏం జరిగింది? పోగొట్టిన డబ్బుల్ని కిషోర్ సంపాదించాడా? అమెరికా వెళ్లాలన్న తన లక్ష్యాన్ని చేరుకున్నాడా, లేదా? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాలి.
![review](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6148569_r7.jpg)
ఎలా ఉందంటే..: దర్శకుడు చెప్పాలనుకున్న విషయం చాలా మంచిది. ప్రస్తుత సమాజానికి, తల్లిదండ్రుల ఆవేదననీ, పిల్లల ఆలోచనా విధానానికీ అద్దం పట్టేది. అమెరికా వెళ్లాలనుకున్న వాళ్లు ఎన్ని అగచాట్లు పడుతున్నారో, అక్కడకి వెళ్లాక ఎలా మారిపోతున్నారో, వాళ్లకు దూరమైన తల్లిదండ్రులు ఎంత ఆవేదనకు గురవుతున్నారో చెప్పే కథ ఇది. డాలర్ల వేటలో ప్రేమాభిమానాలకు, ఆప్యాయతలకూ ఎలా దూరమవుతున్నారో చెప్పే ప్రయత్నం చేశారు. కథలోని ప్రతి సన్నివేశమూ, ప్రతి సందర్భమూ అమెరికా అనే పాయింటు చుట్టూనే తిరుగుతుంది. ప్రారంభంలో ఓకే అనిపించినా, ప్రతిసారీ అమెరికా.. అమెరికా అంటూ ప్రతి పాత్రా అమెరికా జపం చేయడం వల్ల విసుగు మొదలవుతుంది.
దర్శకుడు ఈ కథని నడిపించిన తీరు కూడా ఏమంత ఆకట్టుకోదు. రొటీన్ విషయాలనే పదేపదే చెప్పినట్టు అనిపిస్తుంది. ఇటీవల దాదాపు ఇదే పాయింట్‌తో 'ప్రతి రోజూ పండగే' విడుదలైంది. దాంతో చూసిన సినిమా మళ్లీ చూస్తున్న భావన కలుగుతుంది. ఈ కథలో ప్రేమ, స్నేహం, యువత లక్ష్యాలూ, దేశభక్తి... ఇలా చాలా విషయాల్ని మేళవించాలనుకున్నాడు దర్శకుడు. కానీ, దేనికీ సరైన న్యాయం చేయలేదనిపిస్తుంది. సన్నివేశాలు, సంభాషణలు అన్నీ పైపై పూతల్లానే అనిపిస్తాయి. ఏదీ ప్రేక్షకులపై బలమైన ముద్ర వేయదు. ప్రేమ సన్నివేశాలు, భావోద్వేగభరిత దృశ్యాలూ అన్నీ సాగదీతగా అనిపిస్తాయి. తనికెళ్ల భరణి కుటుంబానికి సంబంధించిన ఎపిసోడ్ ఒక్కటే కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. పతాక సన్నివేశాలు కూడా ప్రేక్షకుడి ఊహకు అతి దగ్గరగా, అత్యంత సాధారణంగా సాగాయి.
ఎవరెలా చేశారంటే..: సాయి రోనక్ అందంగా ఉన్నాడు. పక్కింటి కుర్రాడిలా కనిపించాడు. సహజంగా నటించాడు. చక్కటి ప్రేమకథలు ఎంచుకుంటే.... తన కెరీర్‌కి ఉపయోగపడతాయి. ప్రీతి అష్రనీ కూడా బాగానే ఉంది. నటనకు స్కోప్ తక్కువ. లిప్‌సింక్ విషయంలో జాగ్రత్త పడాలి. నరసింహారావు, తనికెళ్ల భరణి.. తమ అనుభవాన్నంతా రంగరించారు. రాహుల్ రామకృష్ణ ఎప్పటిలా నవ్వించలేకపోయాడు.
![review](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6148569_r4.jpg)
సుజోయ్ - సుశీల్ అనే ఇద్దరు దర్శకులు కలిసి చేసిన సినిమా ఇది. ఇద్దరు దర్శకులు కలిసి చేశారంటే.. రెండు ఆలోచనలు ఏకకాలంలో పని చేయాలన్న మాట. కానీ ఆ ఆలోచనలు సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. మంచి కథనే ఎంచుకున్నా జనరంజకంగా చెప్పలేకపోయారు. రొటీన్ సన్నివేశాలు, సంభాషణలతో విసిగెత్తించారు. పాటలు ఓకే అనిపిస్తాయి. సినిమా కలర్‌ఫుల్‌గా ఉంది.
బలాలు
కథా నేపథ్యం
సాయి రోనక్
బలహీనతలు
నీరసమైన కథనం
భావోద్వేగాలు బలంగా లేకపోవడం
చివరిగా: కుక్కర్‌లో వేసినా.. కథ ఉడకలేదు.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
![review](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6148569_ra.jpg)
ఇదీ చూడండి : రామ్‌చరణ్‌కు ఆ 'డ్రైవింగ్ లైసెన్స్'తో సంబంధం లేదట!