'మహానటి' చిత్రంతో జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సినిమా విడుదలై రెండేళ్లు దాటుతున్నా ఇంతవరకు అతడి నుంచి మరో చిత్రమేదీ సెట్స్‌పైకి వెళ్లలేదు. చిరు.. నానిల కోసం కథలు సిద్ధం చేస్తున్నట్లు అప్పట్లో వార్తలొచ్చినప్పటికీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. కానీ తాజాగా చిత్రసీమలో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం ఈ యువ దర్శకుడు ప్రభాస్‌తో పని చేసేందుకు సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్ కథానాయకుడిగా ఓ పాన్ ఇండియా చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ప్రణాళిక రచించాడట నాగ్. ఇప్పటికే డార్లింగ్‌కు సరిపడే ఓ ఆసక్తికరమైన కథాంశాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతానికి ప్రభాస్ మరే కొత్త చిత్రానికి సంతకం చెయ్యలేదు. ఇప్పుడు ఈ హీరో దృష్టంతా 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'జాన్' (వర్కింగ్ టైటిల్)పైనే ఉంది. ఇది పూర్తి కావడానికి మరో ఆరు నెలలకు పైగా సమయం పట్టే అవకాశాలున్నాయి. కాబట్టి ప్రస్తుతం ఈ కథ చెప్పి ఓకే చేయించుకోవాలని పట్టుదలతో ఉన్నాడట నాగ్ అశ్విన్. ఇప్పటికే ఒకసారి చర్చలు జరిపినట్లు సమాచారం.
ఈ ఏడాది చివర్లో షూటింగ్..!
రెబల్‌స్టార్ అందుకు అంగీకరిస్తే, ఈ ఏడాది చివర్లోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రభాస్ కోసం రాజమౌళి, కొరటాల శివ, బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కథలు సిద్ధం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పూర్తి సమాచారం కోసం అధికార ప్రకటన వెలువడే వరకు ఎదురుచూడాల్సిందే.
ఇదీ చూడండి.. మహేశ్‌లోని ఆ ప్రత్యేకతే 'మురారి' టైటిల్‌కు కారణమట!