పట్నాలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను ముంబయికి బదిలీ చేయాలని నటి రియా చక్రవర్తి సుప్రీంకోర్టును కోరింది. ఈ మేరకు గురువారం లిఖితపూర్వకంగా న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేసింది. సుశాంత్ తండ్రి కేకే సింగ్ తనపై నిరాధారోపణలు చేస్తున్నారని అందులో పేర్కొంది.
అది చట్టవిరుద్ధం
బిహార్ రాష్ట్రంలో జరుగుతున్న సుశాంత్ కేసు దర్యాప్తు పూర్తిగా చట్టవిరుద్ధమని, ఈ కేసును అక్రమంగా సీబీఐకి బదిలీ చేశారని సుప్రీంకు విన్నవించుకుంది నటి రియా. భారత రాజ్యాంగంలోని 142వ అధికరణ ప్రకారం న్యాయస్థానం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. కానీ, బిహార్ రాష్ట్ర అధికార పరిధిలేని చోట సీబీఐ విచారణ చేయించడం చట్టవిరుద్ధమని కోర్టుకు ఇచ్చిన లిఖితపూర్వక సమర్పణలో తెలిపింది.
బిహార్ సర్కారు నివేదిక
సుశాంత్ మృతి కేసుకు సంబంధించిన తుది నివేదికను బిహార్ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ సందర్భంగా సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించి తాము కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదు చేశామని, విచారణ మొత్తం సీబీఐకి అప్పగించినట్లు వెల్లడించింది. అదే సమయంలో కేసు విచారణను బిహార్ పోలీసుల నుంచి ముంబయికి బదిలీ చేయాలంటూ సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి చేసిన అభ్యర్థనను కొట్టివేయాలని కోరింది.
అసంబద్ధంగా..
రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ముంబయి పోలీసులు కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదని, అదేసమయంలో విచారణకు వచ్చిన పోలీసులకు సరిగా సహకరించలేదని తెలిపారు బిహార్ అధికారులు. చట్ట ప్రకారమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామన్న బిహార్ పోలీసులు.. ఈ ఘటన విచారణ జరగాల్సిన నేరమని స్పష్టం చేశారు. దీనిపై రియా చక్రవర్తి న్యాయవాది స్పందించారు. బిహార్ ప్రభుత్వం చెబుతున్న అంతర్రాష్ట్ర థియరీ అసంబద్ధంగా ఉందని అన్నారు. ముంబయి పోలీసులు, ఈడీల ఆధ్వర్యంలో విచారణ మొత్తం న్యాయబద్ధంగా జరుగుతోందని తెలిపారు.