ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథతో తెరకెక్కుతోన్న చిత్రం 'సైనా'. అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. పరిణీతి చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీని నేరుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై స్పందించిన చిత్రబృందం చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తామని తెలుపుతూ.. రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించింది. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.

ఈ బయోపిక్ కోసం మొదట శ్రద్ధా కపూర్‌ను సంప్రదించింది చిత్రబృందం. కానీ అనుకోని కారణాలతో ఆమె తప్పుకోవడం వల్ల పరిణీతిని అదృష్టం వరించింది. ఇటీవల పరిణీతి నటించిన 'ది గర్ల్ ఆన్ ది ట్రైన్' నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఆమె నటించిన మరో చిత్రం 'సందీప్ ఔర్ పింకీ ఫరార్' మార్చి 19న విడుదల కానుంది. దీంతో వరుసగా రెండు వారాల్లో రెండు చిత్రాలను విడుదల చేస్తూ అభిమానులకు డబుల్ మజా అందించనుంది పరిణీతి.