దివంగత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. సినీ, సంగీత రంగాల్లో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది.
వేలాది పాటలతో కోట్లాది మనసుల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయిన ఈ గాన గాంధర్వుడికి పద్మ అవార్డును ప్రకటించడం పట్ల సంగీత అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇతర పురస్కారాలు
బాలు అత్యద్భుత ప్రతిభకు తగ్గట్టే.. లెక్కలేనన్ని పురస్కారాలు ఆయన్ని వరించాయి. పాటలకు ప్రాణం పోసిన బాలు.. సంగీత ప్రయాణంలో 6 జాతీయ పురస్కారాలు అందుకున్నారు. అలాగే తెలుగునాట ఏకంగా 25 నంది అవార్డులతో భళా అనిపించారు. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల నుంచీ అనేక పురస్కారాలూ దక్కించుకున్నారు. హిందీ పాటకు గానూ ఓసారి, దక్షిణభారత పాటలకు ఆరు పర్యాయాలు ఫిల్మ్ ఫేర్ సాధించారు.
2012 సంవత్సరానికి గాను ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ఎస్పీబీని వరించింది. భారతీయ చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గుర్తింపుగా.. 2016లో సిల్వర్ పీకాక్ మెడల్ వచ్చింది. ఇక భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మశ్రీని 2001లోనూ, పద్మభూషణ్ అవార్డును 2011లోనూ అందుకున్నారు.
మరణం
కరోనా సోకి, తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన.. చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబరు 25న తుదిశ్వాస విడిచారు.