ఉత్తమ నటిగా రెండోసారి ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది ఆఫ్రికన్ అమెరికన్ నటి వోలా డేవిస్. 'మా రైనీస్ బ్లాక్ బాటమ్' చిత్రంలో మా రైనీ పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు అందరి ప్రశంసలు అందుకుంది. ఈ నటనే ఆమెకు 33వ ఆస్కార్ రేసులో నామినేషన్ వచ్చేలా చేసింది. ఈ చిత్రంలో 'బ్లూస్' అనే జానపద గాయనిగా వోలా అద్భుతంగా నటించింది. గతంలో 'ఫెన్సెస్' చిత్రానికి ఉత్తమ సహాయనటిగా ఆస్కార్ పురస్కారం అందుకున్నారు వోలా. ఆమె 'ది హెల్ప్' చిత్రం లోని నటనకు 2011లో ఉత్తమ నటిగా ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్నారు. వెండితెరపైనే కాదు బుల్లితెర మీద అలరించిన ఆమె.. ట్రస్ట్, డౌట్, సూసైడ్ స్క్వాడ్, లీలా అండ్ ఈవ్, విడోస్ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 'ది న్యూయార్క్ టైమ్స్' ప్రకటిం చిన 21వ శతాబ్దంలో 25 గొప్ప నటుల జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచారు డేవిడ్.
కెరీర్ తొలినాళ్లలోనే ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న అమెరికన్ నటి ఆండ్రా డే. 'ది యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ బిల్లీ హాలిడే' చిత్రంలోని నటనకే ఈ నామినేషన్. ఓ విధంగా చెప్పాలంటే తొలి చిత్రానికే ఆమెకు ఈ గౌరవం దక్కినట్టే లెక్క. ఎందుకంటే ఆమె నటించిన తొలి చిత్రం 'మార్షల్'లో ఆమెది ఓ చిన్న పాత్ర అంతే. రెండోది యానిమేటెడ్ చిత్రం 'కార్స్ 3'. ఇందులో స్వీట్ టీ అనే పాత్రకు గొంతు మాత్రమే ఇచ్చింది ఆండ్రా. 'ది యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ బిల్లీ హాలీడే' చిత్రంలో ఆమె ప్రముఖ గాయని బిల్లీ హాలీడే జీవిత కథతో నటించింది. 1940 ప్రాంతంలో అమెరికన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాట పాడిన బిల్లీ జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఉన్నాయి. ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయింది ఆండ్రా డే. ఆమె అసలు పేరు కసాండ్ర ఆమె జీవిత కథలోనే నటించింది. అంతేకాదు బిల్లీ డే స్టేజ్ నేమ్ 'లేడీ డే' స్ఫూర్తితోనే తన పేరును ఆండ్రా డేగా పెట్టుకుంది.
తొలిసారి ఆస్కార్ నామినే షన్ దక్కించుకున్న మరో నటి వనెస్సా కిర్బీ. ఆమె నటించిన 'పీసెస్ ఆఫ్ ఎ ఉమెన్' చిత్రంలోని మార్తా పాత్ర ఆమెకు ఈ నామినేషన్ వచ్చేలా చేసింది. మార్తా ఓ బిడ్డకు జన్మనిస్తుంది. కొద్దిసేపట్లోనే ఆ పాప చనిపోతుంది. దీంతో కుటుంబంలో కలతలు మొదలవుతాయి. మార్తా తల్లి ఆ పాపను దహనం చేయాలంటే మార్తా మాత్రం పరిశోధనలకు ఇవ్వాలనుకుంటుంది. ఆమె భర్త వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఇలాంటి ఓ కుటుంబ డ్రామాలో హృదయానికి హత్తుకునేలా భావోద్వేగాలను పలికించింది కిర్బీ. 'మిషన్ ఇంపాజిబుల్: ఫాల్ అవుట్, మిషన్ ఇంపాజిబుల్ 7 చిత్రాల్లోనూ నటించింది కిర్బీ. మిషన్ ఇంపాజిబుల్ 8లో ఆమె నటిస్తోంది.
స్వేచ్ఛనిచ్చే తల్లిగా, వేధింపులకు గురైన భార్యగా, వ్యభిచారిణిగా, సంచార జీవితాన్ని గడిపే నోమ్యాడ్గా... ఇలా ఎన్నో గుర్తుండిపోయే పాత్రలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి ఫ్రాన్సెస్ మెక్ డోర్మెండ్. ఆమె తన 40 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు. ఇప్పటికే రెండుసార్లు ఆస్కార్ ఉత్తమ నటి కిరీటం అందుకున్న ఆమె.. మూడోసారి రేసులోకి వచ్చారు. రోడ్డు ప్రయాణంలోనే కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ ఒక చోట స్థిరంగా ఉండకుండా సంచారం చేసే నోమ్యాడ్స్ నేపథ్యంతో తీర్చిదిద్దిన కథతో తెరకెక్కిన చిత్రం 'నోమ్యాడ్ ల్యాండ్'. ఇందులో భర్తను కోల్పోయిన 61 ఏళ్ల ఫెర్న్ అనే మహిళ పాత్రలో అద్భుతంగా నటించారు ఫ్రాన్సెస్. ఆమెకు ఈ చిత్రంలోని నటనకే 93వ ఆస్కార్ ఉత్తమ నటి విభాగంలో నామినేషన్ దక్కింది. 'బ్లడ్ సింపుల్', 'ఆల్మెస్ట్ ఫేమస్', 'ది మ్యాన్ హు వజ్నట్ ధేర్, 'మిస్ పెట్రీగ్రూ లివ్స్ ఫర్ ఎ డే', 'మిసి సిప్పీ బర్నింగ్', 'నార్త్ కంట్రీ', 'లోన్ స్టార్' తదితర చిత్రాల్లో తనదైన నటనతో అలరించారు డోర్మండ్.
నటిగా తొలి అడుగులు వేస్తున్న సమయంలోనే 'యాన్ ఎడ్యుకేషన్' చిత్రానికి 2008లో ఉత్తమ నటిగా ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. క్యారీ ముల్లిగన్. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకు 'ప్రామిసింగ్ యంగ్ ఉమెన్' చిత్రంలోని నటనకు గానూ 93వ ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. ఈ చిత్రంలో క్యాసీ థామస్ పాత్రలో ముల్లిగన్ నటించింది. క్యాసీ మెడిసన్ చదివే సమయంలో ఏమోన్రో అనే తన తోటి విద్యార్థి తన స్నేహితురాలు నీనా ఫిషెర్ను రేప్ చేస్తాడు. ఇది క్యాసీ మనసులో బలంగా నాటుకుపోతుంది. ఆ తర్వాత క్యాసీ ఏవిధంగా కక్ష తీర్చుకున్నది అనేది మిగిలిన కథ. ఇందులో క్యాసీగా ముల్లిగన్ నటన ఆకట్టుకుంటుంది. బ్లాక్ కామెడీ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. మంచి వసూళ్లనే అందుకుంది.