Oscar 2022 best actor nominees: ఆస్కార్ పురస్కారాల సందడి మొదలైంది. మార్చి 27న జరగనున్న 94వ ఆస్కార్ వేడుకల కోసం ప్రపంచ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉత్తమ నటుడి రేసులో ఐదుగురు నటులు పోటీపడుతున్నారు. వీళ్లలో ఒక్క బెనిడిక్ట్ కంబర్‌బ్యాచ్ మినహా మిగిలిన నలుగురికి నామినేషన్ రావడానికి కారణం జీవిత కథలే. ఎవరి పాత్రకు తగ్గట్టు వాళ్లు పాత్రల్లో ఒదిగిపోయి అలరించారు. మరి ఈసారి ఉత్తమ నటుడి గౌరవం ఎవరికి దక్కుతుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఆండ్రూ గార్‌ఫీల్డ్
ఉత్తమ నటుడి రేసులో ఉన్న ఐదుగురిలో తక్కువ వయసున్న నటుడు ఆండ్రూ గార్‌ఫీల్డ్ (38). 2017లో 'హాక్సారిడ్జ్' అనే చిత్రానికి ఉత్తమ నటుడిగా నామినేషన్ దక్కించుకున్న గార్‌ఫీల్డ్ ఈసారి మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ‘టిక్..టిక్..భూమ్’ అనే స్టేజ్ మ్యూజికల్ రూపొందించిన జొనాథన్ లార్సెన్ అనే సంగీత కళాకారుడి జీవిత కథ నేపథ్యంలో సాగే చిత్రం ‘టిక్..టిక్..భూమ్’. ఇందులో జొనాథన్ పాత్రలో ఆండ్రూ నటన ఆకట్టుకునేలా సాగుతుంది. ‘టిక్..టిక్..భూమ్’తో పాపులర్ కావడానికి ముందు జొనాథన్ పడిన కష్టాలు, మానసిక సంఘర్షణ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. జొనాథన్ పాత్రలో ఆండ్రూ ఒదిగిపోయిన తీరుకి ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రంలోని నటనకు గోల్డెన్ గ్లోబ్ నామినేషన్ దక్కించుకున్నారు ఆండ్రూ గార్‌ఫీల్డ్. 2017లో ‘హాక్షా రిడ్జ్’ చిత్రం తర్వాత మళ్లీ ఇప్పుడే ఆస్కార్ నామినేషన్ అందుకున్నారు ఆండ్రూ.
బెనిడిక్ట్ కంబర్ బ్యాచ్
‘ది పవర్ ఆఫ్ డాగ్’లోని ఫిల్ బర్‌బ్యాంక్ పాత్రలో ఒదిగిపోయారు బెనిడిక్ట్ కంబర్ బ్యాచ్. ఈ పాత్రలో భిన్న పార్శ్వాల్లో సాగే ఆయన నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. చాలా ఏళ్లుగా తనతో కలిసి ఉన్న తన సోదరుడు ఓ వితంతువు రోజ్ గార్డోన్‌ని పెళ్లి చేసుకుంటాడు. అది ఫిల్‌కు నచ్చదు. దీంతో వదినను పలు ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. రోజ్ మొదటి భర్త సంతానం అయిన పీటర్‌తోనూ అతడి వ్యవహారశైలి సరిగా ఉండదు. ఇలా వైవిధ్యమైన నటనతో ఆకట్టుకున్న కంబర్ బ్యాచ్ ఈ చిత్రంలోని నటనకుగానూ ఉత్తమ నటుడిగా బాఫ్టా, స్క్రీన్ యాక్టర్ గిల్డ్, గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల నామినేషన్లు అందుకున్నారు. 2014లో ‘ది ఇమిటేషన్ గేమ్’లో నటనకు ఉత్తమ నటుడిగా ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్నారు కంబర్.
జేవియర్ బార్డెమ్
ఆస్కార్ రేసులో నిలబడటం, పురస్కారాలు అందుకోవడం జేవియర్ బార్డెమ్‌కు కొత్తేమీ కాదు. గతంలో ‘నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్’ చిత్రంలోని నటనకుగానూ ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అందుకున్నారు. 2000, 2010ల్లో ఆస్కార్ నామినేషన్లు దక్కించుకున్నారు. ఇప్పుడు ‘బీయింగ్ ద రికార్డోస్’ చిత్రానికి ఉత్తమ నటుడిగా నామినేషన్ దక్కించుకుని రేసులో నిలబడ్డారు. ఒకప్పటి అమెరికన్ సిట్యువేషనల్ కామెడీ షో ‘ఐ లవ్ ల్యూసీ’తో పాపులర్ అయిన జంట ల్యూసిల్లే బాల్, దేశీ అర్నాజ్. వీరిద్దరి నిజ జీవితాల నేపథ్యంలో సాగే చిత్రమే ‘బీయింగ్ ద రికార్డోస్’. ఇందులో దేశీ అర్నాజ్ పాత్రలో నటించారు జేవియర్. స్పానిష్ నటుడైన బార్డెమ్ ఈ చిత్రంలో అమెరికాలో పాపులర్ నటుడు అయిన అర్నాజ్ పాత్రలో ఒదిగిపోయారు. ఈ చిత్రంలోని నటనకు 79వ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల్లోనూ ఉత్తమ నటుడిగా మోషన్ పిక్చర్ (డ్రామా) విభాగంలో నామినేషన్ అందుకున్నారు బార్డెమ్.
విల్‌స్మిత్
భారతీయ ప్రేక్షకులకు పరిచయం ఉన్న అమెరికన్ నటుడు విల్‌స్మిత్. 2019లో వచ్చిన ‘అలాద్దీన్’ చిత్రంలో జీనీ పాత్ర పోషించి అలరించిన ఆయన హిందీ చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’లో అతిథి పాత్రలో మెరిశారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న విల్‌స్మిత్ ఇప్పటివరకూ ఆస్కార్ గెలుచుకోలేదు. గతంలో 2002లో ‘అలీ’, 2007లో ‘ది పర్షుట్ ఆఫ్ హ్యాపీనెస్’ చిత్రంలోని నటనకు ఉత్తమ నటుడిగా నామినేషన్ దక్కించుకున్నారు. ఇప్పుడు ‘కింగ్ రిచర్డ్’ చిత్రం ఆయన్ని ఆస్కార్ ఉత్తమ నటుడి బరిలో నిలిపింది. ప్రపంచం మెచ్చిన టెన్నిస్ క్రీడాకారిణులు వీనస్, సెరీనా విలియమ్స్ తండ్రి, కోచ్ అయినా రిచర్డ్ విలియమ్స్ జీవిత కథలో విల్‌స్మిత్ నటించారు. ఇందులో టైటిల్ పాత్రలో విల్‌స్మిత్ చక్కటి భావోద్వేగాలు పండించారు. ర్యాప్ గాయకుడిగానూ ప్రజాదరణ పొందిన విల్‌స్మిత్ ‘కింగ్ రిచర్డ్’తో ఈసారి ఆస్కార్ గెలుచుకుంటాడనే మాట హాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
డెంజిల్ వాషింగ్టన్
రెండుసార్లు ఆస్కార్ ప్రతిమను ముద్దాడి ఇప్పుడు మరోసారి రేసులో కొనసాగుతున్న అమెరికన్ నటుడు డెంజిల్ వాషింగ్టన్. 1990లో ‘గ్లోరీ’ చిత్రంలో పోషించిన పాత్రకు ఉత్తమ సహాయ నటుడిగా తొలి ఆస్కార్ అందుకున్నారు. ఆ తర్వాత 2002లో ‘ట్రైనింగ్ డే’ చిత్రంలో డిటెక్టెవ్ అలోంజో హారీస్ పాత్రను అద్భుతంగా పోషించి ఉత్తమ నటుడిగా ఆస్కార్ గెలుచుకున్నారు. షేక్‌స్పియర్ నాటకాలతో నటుడిగా కెరీర్ ప్రారంభించారు డెంజిల్. ఈసారి ఆస్కార్ నామినేషన్ అందించిన ‘ది ట్రాజెడీ ఆఫ్ మెక్‌బెత్’ చిత్రమూ షేక్‌స్పియర్ నాటకం ‘మెక్‌బెత్’ ఆధారంగానే రూపొందింది. ఈ చిత్రంలో లార్డ్ మెక్‌బెత్ పాత్రలో ఆకట్టుకునేలా నటించారు డెంజిల్. ఆస్కార్ నామినేషన్ ఒక్కటే కాదు గోల్డెన్ గ్లోబ్, స్క్రీన్ యాక్టర్ గిల్డ్ తదితర నామినేషన్లనూ ఈ చిత్రంలోని నటనకు దక్కించుకున్నారు డెంజల్. కెరీర్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ పదిసార్లు ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న డెంజిల్ దర్శకుడు, నిర్మాత కావడం విశేషం.
ఇదీ చూడండి: Oscars 2022: ఆస్కార్ హోస్ట్‌గా రెజీనా!