మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగిసింది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288స్థానాలు ఉండగా 4వేల 136మంది అభ్యర్థులు పోటీ చేశారు. 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నప్పటికీ..చాలా మంది పోలింగ్ కేంద్రాలకు రాలేదు. ఫలితంగా పోలింగ్ మందకొడిగా సాగింది. మహారాష్ట్రలో లక్షా 186 పోలింగ్ కేంద్రాలను..కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. బీజేపీ, శివసేన శిందే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గాలతో కూడిన మహాయుతి కాంగ్రెస్ , శివసేన ఉద్ధవ్ వర్గం, ఎన్సీపీ శరద్ పవార్ వర్గాలు ఉన్న మహావికాస్ అఘాడీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
మహారాష్ట్రలో రాజకీయ, సినీ, క్రీడాప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ముంబయిలో ఓటు వేశారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే కుటుంబ సమేతంగా థానేలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్సీపీ SP పార్టీ అధినేత శరద్ పవార్ బారామతిలో ఓటు వేశారు. ఆయన కుమార్తె సుప్రియా శూలే కుటుంబ సభ్యులతో వెళ్లి ఓటు వేశారు. శివసేన యూబీటీ అధినేత ఉద్దవ్ ఠాక్రే, ఆయన భార్య రష్మి, కుమారుడు ఆదిత్య ఠాక్రే ఓటు వేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కుటుంబ సభ్యులతో కలిసి ముంబయిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడణవిస్ కుటుంబ సభ్యులతో కలిసి నాగ్‌పూర్‌లో ఓటు వేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ కూడా నాగ్‌పూర్‌లో ఓటు వేశారు. ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ గోండియాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓట్ల పండగలో తారలు సందడి చేశారు. బాలీవుడ్ ప్రముఖులు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా, రణ్‌బీర్ కపూర్, అర్జున్ కపూర్, సొహైల్ ఖాన్, అర్బాన్ ఖాన్, సోనూ సూద్, జాన్ అబ్రహం, ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్ ఓటు వేశారు. రాజ్‌కుమార్ రావు, జెనీలియా, ఇషా కొప్పికర్, అలీ ఫైజల్, హేమ మాలిని, ఆమె కుమార్తె ఇషా దేవోల్, సునీల్ శెట్టి, మాధురీ దీక్షిత్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, ఆమె భర్త జైకీ భగ్నానీ, గోవిందా ఓటువేశారు. సైఫ్ అలీ ఖాన్, ఆయన భార్య కరీనా కపూర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.గాయకులు కైలాష్ కేర్, రాహుల్ వైద్య, శంకర్ మహదేవన్ ఓటు వేశారు. మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ భార్య, కుమార్తెతో వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ తన కుమారులు అనంత్, ఆకాశ్, కోడలు శ్లోకా మెహతాతో కలిసి వెళ్లి ముంబయిలో ఓటు వేశారు. టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్
పారిశ్రామికవేత్త అజయ్ పిరమల్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత్ దాస్, భార్యతో కలిసి వెళ్లి ఓటు వేశారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఓట్లను ఈనెల 23న లెక్కించి ఫలితాలు వెలువరించనున్నారు.