నటుడు సాయి కిరణ్ అంటే గుర్తుపట్టకపోవచ్చేమోగానీ.. 'నువ్వే కావాలి' సినిమాలో 'అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది' పాట పాడుతూ కనపించే నటుడు అంటే టక్కున ఆయన రూపం మదిలో మెదులుతుంది. అంతలా అభిమానుల గుండెలకు హత్తుకుపోయింది ఆ పాట. దాంతో పాటే ఆయన కూడా అలానే గుర్తుండిపోయారు. అయితే ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం.. అక్టోబరు 13(నేటి)తో 20 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సాయికిరణ్ కొన్ని చిత్రవిశేషాలను పంచుకున్నారు.
"ఈ చిత్రం ఓ ఆర్టిస్టుగా నా కెరీర్ను మలుపు తిప్పింది. ఎందుకంటే అంతకుముందు ఈటీవీలో ఓ సీరియల్ చేశా. అ తర్వాత ఏమి చేయాలో నాకు అర్థం కాలేదు. ఆ సమయంలో ఈ సినిమా నా జీవితాన్నే మార్చేసింది. నేను నటించిన తొలి సినిమా ఇది. నాకే కాదు తరుణ్, రిచా, త్రివిక్రమ్, సునీల్ ఇలా చాలమందికి ఈ చిత్రం మంచి లైఫ్ ఇచ్చింది. చిత్ర నిర్మాతలు రామోజీరావు, రవికిశోర్, దర్శకుడు విజయ్ భాస్కర్ గారికి నా జీవితాంతం రుణపడి ఉంటా. ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఈ చిత్రంతో ముడిపడి ఉన్నాయి. ఇందులో నటించేట్పపుడు కెమెరా ముందు డైలాగ్ చెప్పాలంటే కొంత భయంభయంగా ఉండేది. కానీ విజయ్ భాస్కర్ నాకు నటన నేర్పించి నన్ను తీర్చిదిద్దారు. ఎంతో ప్రోత్సాహించారు. ఆ సమయంలో ఆయన చెప్పిన కొన్ని మాటలు ఇంకా నాకు గుర్తుకొస్తుంటాయి. ఈ మాటలు నేను మలయాళంలో హిట్ అవ్వడానికి బాగా ఉపయోగపడ్డాయి. మరోసారి చిత్రబృందానికి నా ధన్యావాదాలు" అని మనసులో మాటలను పంచుకున్నారు సాయికిరణ్.