హీరో తరుణ్, రిచా జంటగా కె.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'నువ్వే కావాలి'. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం 20 వసంతాలు(అక్టోబరు 13)న పూర్తి చేసుకోబోతోంది. తరుణ్-రిచాల నటన, విజయ్ భాస్కర్ టేకింగ్, త్రివిక్రమ్ రచనా శైలితో పాటు, సంగీత దర్శకుడు కోటి అందించిన స్వరాలు యువతనే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకుడు విజయ్ భాస్కర్ చిత్ర విశేషాలు పంచుకున్నారు.
"ముందుగా ఈ సినిమాను తెరకెక్కించే అవకాశం ఇచ్చిన రామోజీరావు గారు, రవికిశోర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కమర్షియల్ సినిమా కళ్ల దగ్గరే ఆగిపోతుంది. కానీ ఫీలింగ్ ఉన్న సినిమా కళ్ల నుంచి గుండె వరకు వెళ్లి గుర్తుండిపోతుంది. ఈ సినిమా చూసినప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగిందో చిత్రీకరించేటప్పుడు నాకు అదే అనుభూతి కలిగింది. అయితే ఈ సినిమాలో ముందుగా రెండో హీరో పాత్ర సాయికిరణ్‌ను ఎంపిక చేశాం. ఆ తర్వాత హీరోయిన్ రిచాను తీసుకున్నాం. చిట్టచివరిగా హీరో తరుణ్‌కు అవకాశమిచ్చాం. అతడు ఈ చిత్రంలో నటించలేదు.. జీవించాడు అని చెప్పాలి. అంత గొప్ప సహజ నటన అతనిది. మొత్తంగా ప్రతిఒక్కరూ బాగా నటించారు. ఇక పాటలు, సంగీతం విషయానికొస్తే అత్యద్భుతం. కోటి మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారు. అందరి కృషి వల్లే ఈ సినిమా విజయం సాధించింది. అయితే ఈ చిత్రంలోని 'కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడవెందుకు' పాట కోసం రామోజీరావు నన్ను కలవమన్నారు. అదే మొదటిసారి నేను ఆయన్ను కలవడం. ఈ పాటపై ఆయనకు చిన్న సందేహాలు ఉంటే వాటి గురించి చర్చించుకున్నాం. ఆ తర్వాత నాపై నమ్మకం ఉంచి నన్ను ప్రోత్సాహించారు." అని తన మనసులో మాటలను పంచుకున్నారు.