రాష్ట్రీయ జనతా దళ్ అధినేత అంటే ఎవరికీ గుర్తురారేమో కానీ.. లాలూ ప్రసాద్ యాదవ్ అంటే మాత్రం ఓ నిండైన ఆహార్యం కళ్లముందు మెదులుతుంది. తెల్లని జుట్టు.. రంగు లాల్చీ.. మెడమీదుగా వెళ్లి కళ్లజోడుకు భద్రత కల్పించే తాడు.. జనంపై చెరగని ముద్ర.. విలక్షణ వ్యక్తిత్వం.. ఇవన్నీ లాలూ ట్రేడ్మార్కులు.
ప్రస్తుతం పశుదాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న లాలూ జీవితంపై ఓ సినిమా రాబోతోంది. భోజ్పురి నటుడు యశ్ కుమార్.. లాలూగా నటిస్తున్నారు.
లాల్టెన్(లాంతరు) అనే పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నామని యశ్ కుమార్ వెల్లడించారు. నటి స్మృతి సిన్హా.. లాలూ ప్రసాద్ సతీమణి, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి పాత్ర పోషిస్తున్నారు. బిహార్, గుజరాత్లోని పలు ప్రాంతాల్లో షూటింగ్ జరగనుంది. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది.
రాజకీయ నాయకుల జీవితాల ఆధారంగా సినిమా తీయడం.. చిత్ర రంగంలో ఇప్పుడొక ట్రెండ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా 'పీఎం నరేంద్ర మోదీ', మన్మోహన్సింగ్పై 'ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'తో పాటు అనేక చిత్రాలు విడుదలయ్యాయి.
ఇదీ చూడండి: 'మిర్చి' కేసులో నటి శిల్పాశెట్టి భర్తకు చిక్కులు