సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్న నూతన నటీమణులు, విద్యను అభ్యసిస్తున్న అమ్మాయిలూ తనలా తప్పులు చేయవద్దని, మోసపోకూడదని నటి షకీలా తెలిపారు. దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న షకీలా జీవితాన్ని ఆధారంగా చేసుకుని 'షకీలా' అనే పాన్ ఇండియన్ చిత్రం తెరకెక్కింది. రిచా చద్దా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వం వహించారు. ఇటీవలే చెన్నైలో నిర్వహించిన సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో షకీలా పాల్గొన్నారు.
"నా వ్యక్తిగత జీవితం గురించి ఇప్పుడు మాట్లాడాలనుకోవడం లేదు. నేను బతికుండగానే నా బయోపిక్ తెరకెక్కినందుకు ఎంతో సంతోషంగా ఉంది. 'షకీలా' చిత్రాన్ని తెరకెక్కించిన ఇంద్రజిత్ లంకేశ్‌కు ధన్యవాదాలు. ప్రతిఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒకరంగా ఇబ్బందులు, బాధలు ఎదుర్కొంటారు. మన బాధలు ఎదుటివాళ్లకు తెలియకపోవచ్చు. కాబట్టి వాళ్లు మన గురించి కొంచెం తప్పుగా వ్యాఖ్యలు చేయవచ్చు. నేను అలాంటి వ్యాఖ్యలు పట్టించుకోను. ఎందుకంటే మన ముందు మాట్లాడడానికి ధైర్యం లేక కొంతమంది వెనుక మాట్లాడుతుంటారు. ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న నటీమణులకు, చదువుకుంటున్న అమ్మాయిలకు నేను చెప్పేది ఒక్కటే.. నేను చేసిన తప్పులు మీరు చేయకండి. నాలా మోసపోకండి. ఈ సినిమాలో మహిళల కోసమే ప్రత్యేకంగా ఓ సందేశం ఉంది. ఇప్పటికే నేను ఈ చిత్రాన్ని వీక్షించాను. సినిమా ద్వారా మహిళలకు మంచి సందేశాన్ని ఇవ్వడం నాకెంతో సంతోషంగా అనిపించింది."
- షకీలా, నటి
ఇప్పటికే విడుదలైన 'షకీలా' ట్రైలర్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. క్రిస్మస్ కానుకగా మరికొన్ని రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది. 1995లో పదహారేళ్ల వయసులోనే షకీలా నటిగా కెరీర్ ఆరంభించారు. దాదాపు 250 సినిమాల్లో ఆమె నటించారు. తెలుగులో 'తొట్టిగ్యాంగ్', 'జయం', 'పుట్టింటికి రా చెల్లి', 'నిజం', 'దొంగోడు', 'బంగారం', 'కరెంట్', 'కొబ్బరిమట్టా' తదితర చిత్రాల్లో ఆమె కనిపించారు.
ఇదీ చూడండి: 'ఆ విషయంలో బాలీవుడ్‌కు ఒత్తిడి తక్కువ'