హీరోయిన్ నివేదా పేతురాజ్(Nivetha Pethuraj)కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే.. అందులో బొద్దింక(cockroach in food) వచ్చింది. దీంతో ఈ నటి సదరు రెస్టారెంట్, ఫుడ్ డెలీవరి సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నైలో పేరుపొందిన ఓ ప్రముఖ రెస్టారెంట్ నుంచి బుధవారం సాయంత్రం నివేదా పేతురాజ్ ఫ్రైడ్ రైస్‌ను ఆర్డర్ చేశారు. ఫుడ్ డెలీవరి అయిన అనంతరం ప్యాక్ ఓపెన్ చేయగానే అందులో ఆమెకు బొద్దింక కనిపించింది. దీంతో ఆమె.. రెస్టారెంట్‌ని ట్యాగ్ చేస్తూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు.
![Nivetha Pethuraj finds cockroach in food, Swiggy takes Chennai restaurant off app](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12259070_2.jpg)
"ఇటీవల కాలంలో హోటళ్లు సరిగ్గా పరిశుభ్రతను పాటించడం లేదు అనడానికి ఇదొక ఉదాహరణ. నేను ఆర్డర్ చేసిన భోజనంలో బొద్దింక వచ్చింది. ఈ హోటల్ వాళ్లు సరిగ్గా నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. కొనుగోలుదారుల ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఇలాంటి హోటళ్లపై భారీ జరిమానా విధించాలి."
- నివేదా పేతురాజ్, హీరోయిన్
'ఓరు నాల్ కొథు' అనే తమిళ సినిమాతో నివేదా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అనంతరం 'మెంటల్ మదిలో' (Mental Madilo) చిత్రంతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేశారు. 'చిత్రలహరి' (Chitralahari), 'అల.. వైకుంఠపురములో..' (Ala Vaikuntapuramlo), 'రెడ్' (RED) చిత్రాల్లో నివేదా నటన ప్రేక్షకుల్ని మెప్పించింది.
నివేదా పేతురాజ్ కొత్త చిత్రాలు
దగ్గుబాటి రానా (Rana Daggubati), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటిస్తున్న చిత్రం 'విరాటపర్వం' (Virata Parvam). వేణు ఊడుగుల (Venu Udugula) దర్శకత్వం వహిస్తున్నారు. డి.సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా కనిపించనుండగా.. నివేదా పేతురాజ్ కీలక పాత్ర పోషించనున్నారు.
విశ్వక్సేన్ హీరోగా రూపొందుతోన్న కొత్త చిత్రం 'పాగల్' (Paagal) లోనూ నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తున్నారు. దీంతో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న 'పుష్ప' (Pushpa)లోనూ నివేదా నటించనున్నట్లు తెలుస్తోంది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంతో సాగే కథలో పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నారు బన్ని. ఇందులో హీరోయిన్గా రష్మిక నటిస్తుండగా.. ఓ కీలక పాత్రలో నివేదా పేతురాజ్‌ను ఎంపికచేస్తున్నట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
ఇదీ చూడండి.. బిహార్‌లో స్కూల్ టీచర్‌గా అనుపమ!