కొత్త కథలు.. కొత్త కాంబినేషన్లే కాదు.. కొత్త జోడీలు సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతుంటాయి. విడుదలకు ముందే కావాల్సినంత క్రేజ్ తెచ్చిపెడుతుంటాయి. అగ్ర హీరో యువ హీరోయిన్లతో స్టెప్పులేసినా.. స్టార్ కథానాయిక యువ హీరోతో జోడీ కట్టినా, ప్రేక్షకుల దృష్టి ఆ చిత్రాలపైనే ఉంటుంది. త్వరలో రానున్న కొన్ని సినిమాల్లో ఇలాంటి క్రేజీ జంటల గురించే ఈ స్టోరీ.
పవన్‌తో.. తొలిసారి ఆ ముగ్గురు
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీలో వరుస సినిమాలతో పూర్తి బిజీగా మారిపోయారు. ప్రస్తుతం రెండు చిత్రాలు చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలోని 'హరిహర వీరమల్లు'లో పవన్.. ఇద్దరు కొత్త భామలతో నటిస్తున్నారు. నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆ ముద్దుగుమ్ములు. అలానే 'అయ్యప్పనుమ్ కోశియమ్' రీమేక్‌లో నటిస్తున్న పవన్‌కు జోడీగా నిత్యామేనన్ పేరు వినిపిస్తోంది.
అటు శ్రుతి.. ఇటు కృతి
'బాహుబలి' సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా వరుస చిత్రాలు చేస్తున్నారు ప్రభాస్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్'లో నటిస్తున్నారు. ఇందులో డార్లింగ్‌కు జోడీగా శ్రుతిహాసన్ చేస్తోంది. వీరిద్దరూ కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. దీంతో అంచనాలు అప్పుడే పెరిగిపోతున్నాయి. మరోవైపు 'ఆదిపురుష్'లో కృతి సనన్‌తో కలిసి తెర పంచుకుంటున్నారు. నాగ్ అశ్విన్ తీస్తున్న సైన్స్ ఫిక్షన్ ప్రభాస్ సరసన దీపిక పదుకొణే సందడి చేయనుంది. వీటిలో 'సలార్' వచ్చే ఏడాది ఏప్రిల్ 14న.. 'ఆదిపురుష్' ఆగస్టు 11న విడుదల కానున్నాయి.
మాస్ మహారాజ్‌తో కొత్త భామలు
'క్రాక్' విజయంతో హీరో రవితేజ హిట్ ట్రాక్ ఎక్కారు. ఈ జోష్‌లోనే 'ఖిలాడి'ని పూర్తిచేసే పనిలో పడ్డారు. దీని తర్వాత దర్శకుడు త్రినాథరావు నక్కినతో ఓ సినిమా చేయనున్నారు. ఇందులో మాస్ మహారాజ్ సరసన ఇద్దరు కొత్త భామలు ఉండనున్నారు. ఇందులో భాగంగా లవ్‌లీ సింగ్, ఐశ్వర్య మేనన్ పేర్లు వినిపిస్తున్నాయి.
చైతూతో ముగ్గురు భామలు
అక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్.కె.కుమార్ తీస్తున్న ప్రేమకథా సినిమా 'థాంక్యూ'. ఇందులో చైతూ సరసన ముగ్గురు కథానాయికలు ఆడిపాడనున్నారు. ఇప్పటికే రాశీఖన్నా ఖరారవగా.. మాళవికా నాయర్, ప్రియాంక మోహన్ పేర్లు మిగతా కథానాయిక పాత్రల కోసం వినిపిస్తున్నాయి.
నవీన్‌తో అనుష్క
హీరోయిన్ ఓరియెంటడ్ సినిమాలతో మెప్పిస్తున్న అనుష్క.. ఇప్పుడు పంథా మార్చుతోంది. యువ దర్శకుడు మహేష్ తీస్తున్న సినిమా కోసం 'జాతిరత్నాలు' నవీన్‌తో జోడీ కట్టనున్నట్లు తెలుస్తోంది. నలభై ఏళ్ల మహిళ వయసులో తన కన్నా చిన్నవాడైన కుర్రాడితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అన్నది ఈ చిత్రంలో వినోదాత్మకంగా చూపించనున్నారని సమాచారం.
ఇస్మార్ట్‌తో ఉప్పెన బ్యూటీ
'ఉప్పెన'తో తెలుగు తెరపై ఎగసిన కొత్త అందం కృతి శెట్టి. సుధీర్‌బాబు హీరోగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'లో ప్రస్తుతం నటిస్తోంది. మరోవైపు రామ్ - లింగు సామి కాంబోలో రూపొందుతున్న చిత్రంలోనూ నటిస్తోంది.