బాలీవుడ్ నటుడు, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ అర్మాన్ కోహ్లీని.. ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో సదరు నటుడి ఇంట్లో శనివారం సోదాలు నిర్వహించిన అధికారులు.. అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ముంబయి సిటీ కోర్టు ఎదుట కోహ్లీని హాజరు పరచనున్నారు.
"కోహ్లీ ఇంట్లో స్వల్ప మోతాదులో డ్రగ్స్ పట్టుబడ్డాయి. దీంతో కోహ్లీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించాం. అయితే అతడు వాటికి సరైన వివరణ ఇవ్వలేదు. దీంతో ముంబయిలోని మా కార్యాలయానికి తరలించాం" అని ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే పేర్కొన్నారు. అలాగే డ్రగ్స్ వ్యాపారి అజయ్ రాజు సింగ్‌ను అరెస్ట్ చేసినట్లు సమీర్ తెలిపారు.
గతంలోనూ..
ఇంట్లో 41 స్కాచ్ విస్కీ బాటిల్స్ స్టాక్‌గా పెట్టుకున్నందుకు అర్మాన్ కోహ్లీపై 2018లో ఎక్సైజ్ శాఖ కేసు నమోదు చేసింది. ఇందులో విదేశీ మద్యం కూడా ఉంది. నిబంధనల ప్రకారం ఇంట్లో 12కు మించి మద్యం బాటిల్స్‌ను ఉంచరాదు. కానీ అతడు నిబంధలు అతిక్రమించిన కారణంగా గతంలోనూ అరెస్ట్ చేశారు.
అంతేకాకుండా గతంలో అర్మాన్‌పై అతడి ప్రేయసి నీరు రాంధ్వ కూడా కేసు పెట్టింది. తనను శారీరకంగా హింసించినట్లు ఆరోపించింది. ఈ విషయంలో వారం రోజుల పాటు పరారీలో ఉన్న అతడిని లోనావాలా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ఆ తర్వాత ఈ కేసును తన ప్రేయసి కేసును ఉపసంహరించుకుంది.
ఇక సినిమాల విషయానికొస్తే అర్మాన్.. 'జానీ దుష్మన్', 'ప్రేమ్ రతన్ ధన్‌పాయో' వంటి తదితర చిత్రాల్లో నటించాడు.
ఇదీ చూడండి: 'ఒక్క రోజు ఆలస్యమైతే చనిపోయేవాడ్ని'