తమకు పెళ్లి జరిగి 15 ఏళ్లు అవుతున్నా సరే ఇంకా ప్రేమలో మునిగి తేలుతున్నట్లే ఉందని నమ్రతా శిరోద్కర్ చెప్పారు. భర్త మహేశ్‌బాబుతో ప్రేమ, వైవాహిక జీవితంతో పాటు తదితర విషయాల గురించి గతంలో ఓ ఇంటర్యూలో ఆమె మాట్లాడారు.
"మహేశ్ చాలా సిగ్గరి. షూటింగ్ అయిన తర్వాత హీరోయిన్లతో అస్సలు మాట్లాడరు. ఈ విషయంలో అతడిని నేను పూర్తిగా నమ్మాను" అని నమ్రతా వెల్లడించారు.
"మేం తొలిసారి 'వంశీ' షూటింగ్లో కలిశాం. మేం కలిసి చేసిన సినిమా అదొక్కటే. మా ఇద్దరి కెరీర్లోనూ ఘోరంగా ఫెయిల్ అయిన సినిమా కూడా అదే. కానీ మాకు 'వంశీ' వల్ల మంచే జరిగింది. నేను తొలిసారి మహేశ్‌ను చూడగానే నా జీవిత భాగస్వామి అతడేనని ఫిక్సయిపోయాను. అయితే మహేశ్ కుటుంబానికి నాపై సందేహమే. అలా అని ఏం వ్యతిరేకత కాదు. నా గురించి వాళ్లకు అప్పటికీ ఏం తెలియదంతే. అయితే ఇరుకుటుంబాలను ఒప్పించడానికి మాకు నాలుగేళ్లు పట్టింది. ఆ సమయంలో మహేశ్ నేను కలుసుకుంది చాలా తక్కువ. ఒకవేళ పెళ్లంటూ చేసుకుంటే అతడినే చేసుకుంటా లేదంటే పూర్తిగా ఎవ్వరినీ చేసుకోను అని నిర్ణయించుకున్నాను" అని నమ్రతా ఆనాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నారు.
15 ఏళ్ల తమ వైవాహిక జీవితం చాలా వేగంగా గడిచిపోయిందని నమ్రతా అన్నారు. భర్త, ఇద్దరు పిల్లలే తనకు ప్రపంచమని చెప్పారు. రెండు రోజులు అతడు ఇంట్లో లేకపోయినా ఏం తోచదని ఆమె తెలిపారు.
ప్రస్తుతం 'సర్కారు వారి పాట' షూటింగ్ కోసం కుటుంబంతో సహా దుబాయ్ వెళ్లారు మహేశ్‌బాబు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇవీ చదవండి: