ఓవైపు కొవిడ్ ఉద్ధృతి భయపెడుతున్నా.. ధైర్యంగా చిత్రీకరణలు పూర్తి చేస్తున్నాడు కథా నాయకుడు నాగ చైతన్య. ఇతడు ఇటీవలే 'థ్యాంక్యూ' చిత్రం కోసం ఇటలీ వెళ్లి వచ్చాడు. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఇది పూర్తయిన వెంటనే చైతూ 'లాల్ సింగ్ చద్దా' సినిమా కోసం రంగంలోకి దిగనున్నాడని సమాచారం.
ఆమిర్‌ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో చైతూ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. త్వరలో లద్దాఖ్, కార్గిల్ ప్రాంతాల్లో ఆఖరి షెడ్యూల్‌ని ప్రారంభించనున్నారు. ఈ షెడ్యూల్‌లోనే చైతూ చిత్రబృందంతో కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చైతూ లుక్, కనిపించే విధానం కొత్తగా ఉండనున్నాయట. ఇందుకోసం అతడు తన మేకోవర్‌ని పూర్తిగా మార్చుకోనున్నాడని సమాచారం. ఇప్పటికే ఆ దిశగా చైతూ కసరత్తులు ప్రారంభించాడట.
ఈ సినిమా కోసం చైతన్య 15రోజులు చిత్రీకరణలో పాల్గొననున్నాడని తెలుస్తోంది. హాలీవుడ్‌లో విజయవంతమైన 'ఫారెస్ట్ గంప్'కి రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. అద్వైత్ చందన్ దర్శకుడు.