దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ గుర్తింపు పొందిన ప్రముఖ నటి రమ్యకృష్ణ. 'కల్‌నాయక్' (1993), 'క్రిమినల్' (1995), 'శాపత్' (1997), 'బడే మియా చోటే మియా' (1998) వంటి చిత్రాలతో హిందీ ప్రేక్షకుల్ని అలరించారామె. ఆపై బాలీవుడ్‌లో కొత్త ప్రాజెక్టులకు సంతకం చేయలేదు. ఈ నేపథ్యంలో హిందీ సినిమాల్లో నటించడంపై రమ్యకృష్ణను ఓ మీడియా ప్రశ్నించగా స్పందించారు.
"నిజానికి నా సినిమాలు ఉత్తరాదిలో సరిగ్గా ఆడలేదు. ఇక్కడ నాకు వచ్చిన ఆఫర్లు కూడా ఆసక్తికరంగా లేవు. అందుకే ఇన్నేళ్లు నటించలేదు. దక్షిణాదిలో నేను విజయవంతంగా రాణిస్తున్నా"
-రమ్యకృష్ణ, సీనియర్ నటి
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న 'ఫైటర్' (పరిశీలనలో ఉంది) సినిమాలో నటిస్తున్నారు రమ్యకృష్ణ. విజయ్ దేవరకొండ కథానాయకుడు. అనన్యా పాండే కథానాయిక. పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్న ఈ సినిమాలో విజయ్ తల్లిగా రమ్యకృష్ణ కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమా గురించి రమ్యకృష్ణ మాట్లాడుతూ.. "బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ దీనికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా మరో స్థాయిలో ఉండబోతోంది. దాదాపు మరో 'బాహుబలి' కాబోతోంది" అని విశ్వాసం వ్యక్తంచేశారు.