నటి ఐశ్వర్య రాజేశ్.. పదహారణాల తెలుగమ్మాయి. అయినా తన కెరీర్ ప్రారంభం నుంచి ఎక్కువగా తమిళంలోనే నటిస్తూ, స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. గ్లామర్ పాత్రలతోనే కెరీర్‌ను తూచే రంగుల ప్రపంచంలో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ వరుస విజయాలను దక్కించుకుంటోంది. టాలీవుడ్లో గతేడాది 'కౌసల్య కృష్ణమూర్తి'గా ఎంట్రీ ఇచ్చింది. త్వరలో రానున్న 'వరల్డ్ ఫేమస్ లవర్'లో ఓ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పేరు వెనుకున్న ఓ ఆసక్తికర కథ చెప్పిందీ భామ.
" చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాక తెరపై నా పేరు ఐశ్వర్య అనే వేసేవారు. కాకపోతే అప్పటికే ఇక్కడ ఐశ్వర్యరాయ్, ఐశ్వర్య అర్జున్, ఐశ్వర్య అని అనేక మంది నటీమణులు ఉండటం వల్ల ప్రేక్షకుల్లో ఏ ఐశ్వర్య అన్న అనుమానం ఉండేది. అందుకే పేరు మార్చుకుందామని అనుకున్నా. కానీ, అమ్మ వారించింది. మీ నాన్నగారు ఎంతో ఇష్టంగా నీకు ఐశ్వర్య అని పేరు పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోకు అని చెప్పింది. అప్పుడే అనిపించింది.. నాన్న పేరునే పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఆయన ఎప్పుడూ నాతో ఉన్నట్లు ఉంటుంది అని ఆలోచించి నా పేరు వెనుక ఆయన పేరు చేర్చి, ఐశ్వర్య రాజేశ్‌గా మారా. తమిళంలో 'కాకముట్టా'తో మంచి గుర్తింపు దక్కింది. అందులో నా పేరు ఐశ్వర్య రాజేశ్గానే ఉంటుంది. నిజానికి అంతకు ముందు నటించిన రెండు చిత్రాల్లోనూ అలాగే పేరు వేయించుకున్నా కానీ, ఈ సినిమాతోనే పేరొచ్చింది. ఇప్పుడు నటిగా నాకింత పేరు దక్కడంలోనూ నాన్న ఆశీర్వాదాలు ఎంతో ఉన్నాయనిపిస్తుంది. ఆయన్ని నా ఎనిమిదేళ్ల వయసులోనే కన్నుమూశారు."
- ఐశ్వర్య రాజేశ్, నటి
రౌడీ హీరో విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్'.. ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రాశీఖన్నా, కేథరిన్, ఇస్బెల్లాతో పాటు ఐశ్వర్య రాజేశ్ ఓ హీరోయిన్. గోపీసుందర్ సంగీతమందించాడు. క్రాంతి మాధవ్ దర్శకుడు. కేఎస్ రామారావు నిర్మాత.
ఇదీ చదవండి: నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్న 'శంకరాభరణం'