'బుట్ట బొమ్మా..' అంటూ మనతో స్టెప్పులేయిస్తాడు. 'మగువా..'అంటూ మహిళా ప్రాముఖ్యతను బాణీలు కట్టి వినిపిస్తాడు. క్లాస్, మాస్, మెలోడీ అనే భేదం లేకుండా ఇండస్ట్రీలోని బడా హీరోలందరికి గుర్తుండేపోయే అల్బమ్స్ ఇచ్చిన సంగీత దర్శకుడు తమన్. ప్రపంచస్థాయి మ్యూజిక్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయడంలో ముందుంటున్నారు. త్వరలో 'వకీల్‌సాబ్' విడుదలవుతున్న తరుణంలో ఆ సినిమా పాటల ప్రయాణంలోని సంగతులను ప్రేక్షకులతో పంచుకున్నారు. అవేంటో చూసేద్దామా!
గతేడాది 'అలవైకుంఠపురం' నాకు పెద్ద విజయాన్నిచ్చింది. దానికి ప్రధాన కారణం బన్నీ, త్రివిక్రమ్‌గార్లే. కానీ, కరోనా వల్ల ఆ సక్సెస్ అస్వాదించలేకపోయాను. అయితే ఆ చిత్రంలోని పాటలు సృష్టించిన ప్రభంజనం ఆనందాన్నిస్తుంది. ఏ సంగీత దర్శకుడైనా అయినా మొదట్లో కొత్తదనం చూపించడం పరిపాటి. కానీ నిరంతర సాధన వల్లే నేను చేస్తున్న ఆల్బమ్స్‌లో వైవిధ్యం చూపించగల్గుతున్నా.
కరోనా లాక్‌డౌన్ వల్ల థియేటర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. కానీ, ప్రస్తుతం వరుస సినిమాలతో కళకళలాడుతున్నాయి. నేను సంగీతం అందించిన 'సోలో బ్రతుకే సో బెటరు' సినిమాతో మళ్లీ థియేటర్లు ఆరంభం కావడం సంతోషానిచ్చింది. ఆ చిత్ర నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్‌గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఆ తర్వాత వచ్చిన 'క్రాక్' కూడా బ్లాక్‌బస్టర్ కొట్టడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేపథ్యసంగీతానికి మంచి పేరొచ్చింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇక 'వకీల్‌సాబ్' విషయానికొస్తే పవర్‌స్టార్ చిత్రానికి పనిచేయాలనేది నా చిరకాల కోరిక. 'మిరపకాయ్' సినిమా చేస్తునప్పుడే 'గబ్బర్ సింగ్' అవకాశం వచ్చింది. కానీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల చేయలేకపోయా. ఆయన సినిమా అనగానే ఒక కమర్షియల్ ఫార్మాట్‌లో ఆరుపాటలను అదరగొట్టేలా చేద్దామనుకున్నా. కానీ, 'వకీల్‌సాబ్' జోనర్ వేరు. ఇందులో చేసిన ప్రతీ సాంగ్‌ను బాగా ఎంజాయ్ చేశా. గతంలో జనసేనకు కొన్ని పాటలు చేశాను. అప్పడే పవన్‌కల్యాణ్‌గారితో అనుబంధం బలపడింది. పవన్ కల్యాణ్‌గారి స్టార్‌డమ్‌కు తగ్గట్టు సంగీతం అందించా.
అలాగే డైరెక్టర్ వేణుశ్రీరామ్‌తో, దిల్‌రాజుగారితో రెగ్యులర్‌గా సమావేశాలు జరుగుతుండేవి. ఎక్కువసేపు చర్చించేవాళ్లం. వారి దృష్టికోణంలో సినిమా ఎలా ఉండాలో నాకు చెప్తుండేవారు. ఎందుకంటే 'పింక్' సినిమాలో ఇన్ని పాటలకు అవకాశం లేదు. కానీ తెలుగులో రీమేక్ చేస్తునప్పుడు మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మార్పులు చేయాలి. పవన్‌కల్యాణ్ గారి స్థాయికి తగినట్టు ఉండాలి. అలా చర్చల్లో భాగంగానే 'మగువా..' పాట పుట్టింది. ఈ జర్నీని ఆస్వాదిస్తున్నా. నేపథ్య సంగీతం కొత్త అనుభూతినిస్తుంది. 'అయ్యప్పునమ్ కోషియమ్' తెలుగు రీమేక్‌లో పవన్‌కల్యాణ్‌గారితో సాంగ్ పాడిస్తున్నా..
నేనెప్పుడూ విజయాలను తలకెక్కించుకోను, అపజయానికి కుంగిపోను. నెంబర్ గేమ్‌కు చాలా దూరంగా ఉంటా. కష్టపడి పనిచేయటమొక్కటే నాకు అలవాటు. అలాగే 24 క్రాఫ్ట్స్‌లో ఉన్న టెక్నీషియన్స్ కలిసి పనిచేస్తేనే విజయం లభిస్తుంది. ఆ సూత్రాన్ని బాగా నమ్ముతా. వకీల్‌సాబ్‌లోని పాటలన్నీ కథలో భాగంగా ఉంటాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'మగువా..' పాటను చాలా తక్కువ సమయంలో కంపోజ్ చేశా. మహిళాదినోత్సవం కానుకగా ఆ సాంగ్ రిలీజ్ చేయాలనుకున్నాం. వెంటనే రామ్‌జోగయ్యశాస్త్రిగారితో కూర్చుని ఒక అద్భుతమైన పాటకు ప్రాణం పోశాం. ఒక మహిళ జీవన పరిణామక్రమం మొత్తం స్ఫురించేలా సాహిత్యం ఉంటుంది. ఈ పాటకు అంతం అనేది లేదు.
రిలీజ్ కానున్న సినిమాల్లో 'టక్ జగదీష్' రెడీగా ఉంది. అలాగే 'సర్కారువారిపాట'కు అదిరిపోయే అల్బమ్ ఇవ్వటం పక్కా. మెగాస్టార్ చిరు 'లూసిఫర్' రీమేక్‌కు కూడా సంగీతం అందిస్తున్నా. అసలేమాత్రం ఖాళీ లేకుండా బిజీ క్యాలెండర్ రెడీగా ఉంది(నవ్వులు).
'పింక్' సినిమాను నేను చూడలేదు. ఎందుకుంటే ఫ్రెష్ ఫీలింగ్ ఉంటేనే కొత్తదనం చూపించగల్గుతాం. సినిమాకు పనిచేసినంత కాలం పవన్ కల్యాణ్‌గారి ఇమేజ్ ఎప్పుడూ నా కళ్ల ముందు కదులుతుండేది. ప్రతీ హీరోకి వారి ఇమేజ్‌కి తగ్గట్టు మ్యూజిక్ అందించటం నా ప్రత్యేకత. నా దృష్టిలో డైరెక్టర్ తర్వాత ప్రేక్షకులకు కథ చెప్పగలిగేది సంగీత దర్శకుడే. అర్థం లేని విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగడమే నా లక్ష్యం.
ఇదీ చూడండి: ఒక తొలిప్రేమ, ఖుషి, జల్సా.. అలాగే వకీల్‌సాబ్