హీరోయిన్ ఆలియాభట్ ప్రధాన పాత్రలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'గంగూబాయ్ కతియావాడి'. హుస్సేన్ జైదీ రచించిన 'మాఫీయా క్వీన్స్ ఆఫ్ ముంబయి'లోని 'మేడమ్ ఆఫ్ కామతిపుర' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఆలియా, సంజయ్, ఈ చిత్ర కథ రచయితకు ముంబయి కోర్టు సమన్లు జారీ చేసింది. మే 21లోపు న్యాయస్థానం ముందు వారు హాజరు కావాలని ఆదేశించింది.
ఎందుకు పంపింది?
అంతకుముందు ఈ సినిమా నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ గంగూబాయ్ కుమారుడు బాబూజీ రావ్జీ షా.. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చిత్ర దర్శకుడు భన్సాలీ సహా హీరోయిన్ ఆలియా భట్, రచయిత హుస్సేన్ జైదీ, పాత్రికేయుడు జేన్ బోర్గెస్లపై ఆయన కేసు పెట్టారు.
అసలేంటి ఈ వివాదం..?
పాత్రికేయుడు జేన్ బోర్గెస్ సహకారంతో హుస్సేన్ జైదీ రాసిన 'ది మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబయి' పుస్తకం ఆధారంగా ఈ సినిమాను భన్సాలీ రూపొందిస్తున్నారు. అనుకోని పరిస్థితుల్లో చిన్నవయసులోనే వేశ్యగా మారిన గంగూబాయి.. తర్వాత ముంబయి మాఫియా క్వీన్‌గా ఎలా ఎదిగిందో ఈ పుస్తకంలో రచయిత వివరించారు. అయితే.. ఈ పుస్తకం తమకు పరువునష్టం కలిగిస్తోందని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు బాబూజీ. తమ గోప్యత, ఆత్మగౌరవం, స్వేచ్ఛలకు భంగం కలిగించేలా ఉందని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పుస్తకంలోని గంగూబాయి అధ్యాయాల్ని తొలగించాలని, భన్సాలీ సినిమాను నిలిపివేయాలని పిటిషన్లో కోరారు. అందులో భాగంగానే రావ్జీ అభ్యర్థనపై విచారణ చేపట్టిన కోర్టు.. తాజాగా ప్రతివాదులకు సమన్లు పంపింది.
ఎవరీ గంగూబాయి..?
హుస్సేన్ రాసిన పుస్తకం ప్రకారం 1960ల్లో గంగూబాయి తన ప్రేమికుడితో గుజరాత్ నుంచి పారిపోయి ముంబయికి చేరుకుంది. మోసం చేసిన ప్రియుడు ఆమెను రూ.500కు వ్యభిచార గృహాలకు అమ్మేశాడు. అనంతరం తానే కొన్ని వ్యభిచార గృహాలను నడిపేది. అలా ఆమెను మేడమ్ ఆఫ్ కామతిపురగా పిలిచేవారు. అప్పట్లో ఉన్న బడా ముంబయిడాన్‌లతో ఆమెకు పరిచయాలుండేవి. తర్వాత కాలంలో సెక్స్‌వర్కర్ల హక్కుల కోసం పోరాడింది. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం చూపింది.
ఇదీ చూడండి: 'చరిత్రను కించపరిచేందుకే 'తెర'పైకి గంగూబాయ్'