Singer Anantha sriram at Bapatla: భం.. భం అఖండ అంటూ భక్తి గీతంతో తన్మయత్వానికి గురి చేయాలన్నా.. యాయా.. జై బాలయ్య అంటూ హూషారెత్తించే మాస్ పాటతో నృత్యం చేయించాలన్న సినీ పాటల రచయిత అనంత శ్రీరామ్‌కే చెల్లింది. ప్రేమగీతాలతో యువత మది దోచారు. 16 ఏళ్ల ప్రస్థానంలో 600కు పైగా సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్ పాటలు రాసి యువ సినీ రచయితగా తనదంటూ ప్రత్యేక ముద్ర వేశారు. జిల్లెళ్లమూడి మాతృశ్రీ ప్రాచ్య కళాశాల స్వర్ణోత్సవాల ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి ఆదివారం బాపట్ల వచ్చిన ఆయన.. "ఈటీవీ భారత్"తో ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
ప్రేమ గీతాలకు ఎక్కువ ఆదరణ..
సినిమాల్లో మాస్, యుగళ, ప్రేమ గీతాలు రాశాను. డిజిటలైజేషన్ వల్ల యువత ఎక్కువగా ప్రేమగీతాలు వింటున్నారు. చూస్తున్నారు. నేను రాసిన పాటల్లో ప్రేమ పాటలకు యువత నుంచి మంచి ఆదరణ లభించింది. ఒక పాట రాయటానికి రెండు గంటల నుంచి రెండు నెలలకు పైగా సమయం పట్టేది. అఖండ సినిమాలో రం..ధం..ఖం..జం అంటూ శబ్ద పద ప్రయోగాలతో రాసిన పాటకు మంచి పేరు వచ్చింది. సంగీత దర్శకుడు థమన్ ట్యూన్ కట్టిన తర్వాత మూడు రోజుల్లో ఈ పాట రాశా. అభిమానులను దృష్టిలో పెట్టుకుని యాయా.. జై బాలయ్య అంటూ రాసిన పాట సైతం సూపర్‌హిట్ అయింది. బాహుబలిలో పచ్చ బొట్టేసినా పాట రాయటానికి 73 రోజుల సమయం పట్టింది.
కళాకారులకు మేలే..
కరోనా ఒక రకంగా కళాకారులకు మేలే చేసింది. లాక్‌డౌన్ వల్ల వచ్చిన విరామ సమయాన్ని దర్శకులు, నిర్మాతలకు రచయితలతో అద్భుతమైన కథలు, పాటలు, మాటలు రాయించటానికి ఉపయోగపడింది. రచయితలు కొత్త ఆలోచనలతో రచనలు చేయటానికి తగిన సమయం లభించింది. ఒమిక్రాన్ వల్ల మళ్లీ లాక్‌డౌన్ రాకూడదనే భావిస్తున్నా. ప్రేక్షకుల ఆదరణ దర్శకులు, సంగీత దర్శకుల ప్రోత్సాహం వల్ల మంచి పాటలు రాస్తున్నా. యూట్యూబ్ ఛానల్ ద్వారా పాటల్లో సరికొత్త ప్రయోగాలు చేయాలని ఉంది.
నా ఊరే స్ఫూర్తి..
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని దొడ్డిపట్ల నా సొంతూరు. గోదావరి తీరంలో పెరిగా. నా ఊరిని స్ఫూర్తిగా తీసుకుని పాఠశాల దశ నుంచే పద్యాలు, పాటలు రాయటం ప్రారంభించా. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో 2002లో సివిల్ ఇంజినీరింగ్ కోర్సులో చేరా. రెండేళ్లు చదివిన తర్వాత 2005లో సినీ రంగంలోకి వెళ్లి పాటలు రాయటం ప్రారంభించా. కళాశాలలో చదువుతున్న రోజుల్లో సినిమాలు చూడటానికి నగదు కోసం ప్రేమలో ఉన్న స్నేహితులకు ప్రేమ కవితలు రాసి ఇచ్చి ఒక్కో కవితకు రూ.125 తీసుకునేవాన్ని. పెద్ద కవితలకు రూ.250 తీసుకునేవాన్ని ఇలా సంపాదించిన నగదుతో హాలుకు వెళ్లి సినిమాలు బాగా చూసేవాడిని.
సిరివెన్నెలకు ప్రత్యామ్నాయం లేదు..
సినీ రంగంలో ప్రతిభావంతులైన యువ పాటల రచయితలు ఉన్నా వేటూరి, సిరివెన్నెల వంటి దిగ్గజాలకు ప్రత్యామ్నాయం కాలేరు. ఇద్దరూ తెలుగు సినీ సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించారు. వారు లేని లోటును ఎవరూ పూడ్చలేరు. పాటకు గొప్ప స్థాయి కల్పించి ఉన్నత ప్రమాణాలు నెలకొల్పారు. యువతను ఉర్రూతలూగించే పాటలు రాశారు. మా తరం రచయితలు వేటూరి, సిరివెన్నెలను స్ఫూర్తిగా తీసుకుని మంచి పాటలు రాయాలి. పరిమిత పదాలతో భావుకత ఉండేలా పాటలు రాయటం యువత రచయితలకు ఒక రకంగా కత్తి మీద సామే. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా కొత్త పదాల ప్రయోగంతో పాటలు రాస్తాం.
మన్ననలు పొందడమే గొప్ప పురస్కారం
ఇప్పటి వరకు నేను రాసిన పాటల పట్ల పూర్తి సంతృప్తిగా లేదు. ఈ అసంతృప్తితోనే మరిన్ని గొప్ప పాటలు రాయటానికి ప్రయత్నిస్తున్నా. జాతీయ, నంది, సైమా, ఫిల్మ్‌ఫేర్ పురస్కారాల కన్నా ప్రేక్షకుల మదిలో నానుతూ అందరి మన్ననలు పొందటాన్ని గొప్ప పురస్కారంగా భావించి సంతోషిస్తా. నా అర్హతకు మించి మంచిపేరు వచ్చింది. పాటల్లో కొత్త తరహా ఒరవడి తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నా. బాగా సంతృప్తి ఇచ్చే పాట రాసిన తర్వాతే సినీ రచయితగా తప్పుకుంటా. బాపట్ల కళలకు కాణాచి. గొప్ప సామాజికవేత్తలు ఉన్న పట్టణం. త్వరలో విడుదల కానున్న ఆచార్య, సర్కారువారిపాట, థ్యాంక్‌యూ సినిమాల్లో పాటలు రాశా. ఇవి ప్రేక్షకులను అలరిస్తాయన్న నమ్మకం ఉంది.
ఇదీ చదవండి: TDP President Chandrababu : 'ప్రజాక్షేత్రంలో మీ తప్పులకు శిక్ష తప్పదు'