ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిబంధనల మేరకు సినిమాలు ప్రదర్శిస్తున్నారు. దీంతో ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిన్న సినిమాలు థియేటర్‌ల వైపు క్యూ కడుతున్నాయి. అగ్ర కథానాయకులు సినిమాలు మాత్రం థియేటర్‌లో రావడానికి సరైన సమయం కోసం వేచి చూస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే చేసుకున్న ఒప్పందం మేరకు సినిమాలను ఓటీటీ(ott releases telugu) వేదికగా తీసుకొస్తున్నారు. మరి ఆగస్టు చివరి వారంలో థియేటర్/ఓటీటీలో సందడి చేయబోయే సినిమాలేంటో చూసేద్దామా!
'శ్రీదేవి సోడా సెంటర్'తో సుధీర్‌బాబు
సుధీర్‌బాబు, ఆనంది కీలక పాత్రల్లో కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ లవ్‌స్టోరీ 'శ్రీదేవి సోడా సెంటర్'.(sridevi soda center) గ్రామీణ నేపథ్యంలో ప్రేమ, కుటుంబ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో సుధీర్ నటన మునుపెన్నడూ లేనివిధంగా ఆకట్టుకునేలా ఉంది. ప్రేమతో ఒక్కటైన సూరిబాబు(సుధీర్ బాబు) శ్రీదేవిలను (ఆనంది) కులం పేరుతో పెద్దలు విడదీశారా? శ్రీదేవికి వేరే వ్యక్తినిచ్చి పెళ్లి చేశారా? సూరిబాబు జైలుకి వెళ్లడానికి కారణమేమిటి? వంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఆగస్టు 27న థియేటర్‌లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
థియేటర్‌లో వాహనాలు నిలపండి అంటున్న సుశాంత్
'ఇచ్చట వాహనములు నిలుపరాదు.. నో పార్కింగ్'(ichata vahanamulu nilupa radu) అంటూనే థియేటర్‌లో పార్కింగ్ చేసుకోండి అంటున్నారు యువ కథానాయకుడు సుశాంత్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. మీనాక్షి చౌదరి హీరోయిన్. ఎస్.దర్శన్ తెరకెక్కించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఆగస్టు 27న థియేటర్‌లలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. లవ్, ఫ్యామిలీఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు స్వరాలు సమకూర్చారు.
ఆ హాస్యనటులంతా 'హౌస్ అరెస్టు' అయితే..
శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, రవిబాబు, రఘు, తాగుబోతు రమేశ్ కలిసి నటించిన చిత్రం 'హౌజ్ అరెస్ట్'. శేఖర్ రెడ్డి యర్నా దర్శకుడు. ఆగస్టు 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తిస్థాయి కామెడీ నేపథ్యంలో రూపొందింది ఈ చిత్రం. హాస్యనటుల గ్యాంగ్ దొంగతనం చేసేందుకు ఓ ఇంటికి వెళ్తుంది. ఆ ఇంట్లోని పిల్లలు వీరిని హౌజ్ అరెస్ట్ చేస్తారు. తర్వాత ఏం జరిగింది? సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
ఓటీటీలో వచ్చే చిత్రాలివే!-
ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రలో రతీంద్రన్ ఆర్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'భూమిక'. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 23న నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఇది మర్డర్ మిస్టరీ కథా? ఆత్మల నేపథ్యంలో సాగే సినిమానా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సమర్పిస్తున్న 'భూమిక' చిత్రాన్ని కార్తికేయన్ సంతానం, సుధాన్ సుందరం, జయరామన్ నిర్మిస్తున్నారు.
లాక్‌డౌన్ ఆంక్షలు.. పిసినారి పెళ్లికొడుకు కష్టాలు!
హాస్య నటుడు సత్య హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'వివాహ భోజనంబు'. అర్జావీ రాజ్ కథానాయిక. యువ నటుడు సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రం ఆగస్టు 27న సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. కరోనా కారణంగా ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటిస్తుంది. అదే రోజు పెళ్లి చేసుకున్న ఓ పిసినారి ఇంట్లో పెళ్లికి వచ్చిన బంధువులు ఉండిపోవాల్సి వస్తుంది. మరి ఆ వ్యక్తి బంధువులకు అయ్యే ఖర్చంతా ఎలా భరించాడు? వాళ్లని ఎప్పుడు తమ ఇంటికి పంపించాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ సంస్థలు నిర్మించిన ఈ చిత్రాన్ని వెంకటాద్రి టాకీస్ సంస్థ సమర్పించింది. ఈ చిత్రంలో సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శివన్నారాయణ, టీఎన్‌ఆర్ తదతరులు నటించారు. అనివీ సంగీతం అందించారు.
ఆరు కథల 'కసడ తపర'
సందీప్ కిషన్, రెజీనా, హరీశ్ కల్యాణ్, వెంకట్ ప్రభు, విజయ లక్ష్మి కీలక పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం 'కసడ తపర'. చింబు దేవన్ దర్శకుడు. ఆరు వేర్వేరు కథలు ఒక పాయింట్‌తో కనెక్ట్ అయితే వారి జీవితాల్లో ఏం జరిగింది? ఎవరి కథ ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఆగస్టు 27న సోనీలివ్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. వెంకట్ ప్రభు, ఆర్.రవీంద్రన్‌లు నిర్మిస్తున్నారు.
అప్పుడు థియేటర్‌లలో ఇప్పుడు ఓటీటీలో..!
కిరణ్ అబ్బవరం, సాయికుమార్, ప్రియాంక జవాల్కర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ఎస్‌ఆర్ కళ్యాణ మండపం. శ్రీధర్ గాదే దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. 'ఆహా' వేదికగా 'ఎస్‌ఆర్ కళ్యాణమండపం' ఆగస్టు 27న స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవలే ఈ విషయాన్ని ఆహా స్పష్టం చేసింది.
ఇంకా కొన్ని..
అమెజాన్ ప్రైమ్
- స్టాండప్ షార్ట్స్ (ఆగస్టు 26)
- ద కొరియర్ (ఆగస్టు 27)
నెట్‌ఫ్లిక్స్
- ద విచ్చర్ (ఆగస్టు 23)
- అన్‌టోల్డ్ (ఆగస్టు 24)
- పోస్ట్ మార్టమ్ (ఆగస్టు 25)
- హీజ్ ఆల్ దట్ (ఆగస్టు 27)
జీ 5
- ఇంజినీరింగ్ గర్ల్స్ (ఆగస్టు 27)
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
- ద ఎంపైర్ (ఆగస్టు 27)
ఎంఎక్స్ ప్లేయర్
- సబ్ కా సాయి (ఆగస్టు 26)
ఇదీ చదవండి : లీకుల బెడద.. 'పుష్ప' షూటింగ్‌కు భద్రత