తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల తెలుగు నటీనటుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఎంతో శ్రమించి నిర్మించిన ప్రాజెక్టును పొరుగు రాష్ట్రాల సమన్వయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించడం ఆనందంగా ఉందని మా అధ్యక్షుడు నరేశ్ అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిత్యం ప్రజలకు అండగా ఉండాలని కోరారు.
మా అధ్యక్షుడిగా నరేశ్ ఎన్నికైన తర్వాత జరిగిన తొలి సర్వసభ్య సమావేశంలో అసోసియేషన్ ముఖ్య సలహాదారుడిగా సీనియర్ నటుడు, మాజీ ఎంపీ కృష్ణంరాజును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్లో కృష్ణంరాజు దంపతులతోపాటు పరిచూరి బ్రదర్స్, దేవదాసు కనకాలను ఘనంగా సత్కరించారు.
మా అసోసియేషన్ సభ్యులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేస్తున్నట్లు నరేశ్ తెలిపారు. త్వరలోనే ఫిల్మ్నగర్లో నటీనటుల సంఘం భవన నిర్మాణానికి ప్రభుత్వం భూమి కేటాయిస్తుందని వెల్లడించారు. అసోసియేషన్లో సభ్యులుగా ఉన్న మహిళలకు అవకాశాలు రావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. దర్శక, నిర్మాతలు తమ సినిమాల్లో అవకాశాలు కల్పించాలని అన్నారు.
ఇదీ చూడండి: 'తెలుగువాడిగా ప్రజల మెప్పుపొందేందుకు కష్టపడతా'