"సంగీత కచేరి అనేది ఓ హాల్‌లో చేస్తేనే అందం. నృత్యం, నాటకం అన్నవి ప్రేక్షకుల ముందు ప్రదర్శిస్తేనే ఆనందం. అలాగే ఓ సినిమాను వందల మంది ప్రేక్షకుల మధ్య కూర్చొని చూస్తేనే అద్భుతం. ఇలా కాకుండా ఇతర వేదికలపై చూడాల్సి వస్తే దాన్ని సర్దుకుపోవడమే అనుకోవాలి" అంటున్నారు మోహనకృష్ణ ఇంద్రగంటి. 'గ్రహణం', 'అష్టాచమ్మా', 'జెంటిల్‌మెన్', 'సమ్మోహనం' లాంటి చిత్రాలతో మెప్పించిన దర్శకుడాయన. ఇప్పుడు నాని, సుధీర్‌బాబు ప్రధాన పాత్రల్లో 'వి'ని తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో మోహన కృష్ణతో ప్రత్యేక ముఖాముఖి.
కరోనా సమయంలో షూటింగ్ ఎలా ఉండబోతుంది?
చిత్రీకరణలు జరపడమే పెద్ద సవాల్‌గా నిలవబోతుంది. ప్రభుత్వం మాకిచ్చిన నిబంధనల ప్రకారం షూట్ చేయడం చాలా కష్టం. పీపీఈ కిట్లు ధరించాలి, సూట్‌లు వేసుకోవాలి, మేకప్ వాళ్లు నటీనటులకు చాలా దగ్గరగా ఉంటుంటారు.. వాళ్లకి ఉండే సమస్యలేంటి, మిగతా విభాగాల వారికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? అని ఆలోచించాలి. నిర్మాతలు శానిటైజేషన్‌ను తమ బడ్జెట్‌లో భాగం చేసుకోవాలి. పెద్ద నిర్మాతలు దీన్ని భరించగలరు కానీ, చిన్న నిర్మాతలకు పెద్ద తలనొప్పి అయిపోతుంది. నెలాఖరు నాటికి దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.
లాక్‌డౌన్ వస్తుందని గతంలో ఎప్పుడైనా ఊహించారా?
లేదు. నిజంగా ఇది ఓ అనూహ్యమైన విపత్తే. కరోనా ప్రమాదకరంగా కనిపిస్తుండటానికి కారణం.. చాప కింద నీరులా విస్తరిస్తుండటమే. ఇది యుద్ధాలను మించిన క్లిష్ట పరిస్థితి. ఫలితంగా మన సాంఘిక జీవనం మొత్తం దెబ్బతింటోంది. కానీ ఓ విషయం అర్థమైంది ఏంటంటే జీవితంలో మనకంత అవసరంలేని అంశాలు, వస్తువులపైన డబ్బు, సమయాన్ని వృథా చేస్తున్నామని తెలిసింది. చేతిలో ఉన్న సమయాన్ని సృజనాత్మకంగా చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు.. కుటుంబ సభ్యులతో ఎంత హాయిగా గడపొచ్చన్నది అందరూ తెలుసుకోగలిగారు. ఇన్నేళ్లలో ప్రకృతి వనరుల్ని దుర్వినియోగం చేశాం. ఎంతో కాలుష్యం సృష్టించాం? అందుకే ప్రకృతి కరోనా ద్వారా ఓ హెచ్చరిక పంపింది.
'వి' సినిమా ఎలా ఉండబోతుంది?
ఈ చిత్రాన్ని ఓ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. చాలా బలమైన కథతో రూపొందింది. పాత్రలు, వాటికి అర్థవంతమైన కథలు, అందులోని సంఘర్షణలు.. ఇలా భావోద్వేగాలతో నిండిన ఓ ప్రయాణంలానూ ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ చిత్రాన్ని ఓటీటీల్లోకి తీసుకెళ్లాల్సి వస్తుందని భయపడ్డారా?
భయం ఏమీ లేదు. ఇలాంటి చిత్రాలు ఓటీటీ కంటే థియేటర్లలో చూస్తేనే ప్రేక్షకులకు ఆ అనుభూతి తెలుస్తుంది. నా దృష్టిలో సినిమా అన్నదే థియేటర్లలో చూసేందుకు ఉద్దేశించినది. అలాగని ఓటీటీ తక్కువని కాదు. ఈ మధ్య నేనూ ఓటీటీల్లో మంచి కథా బలమున్న చిత్రాలు చూశా. వాటిని వెండితెరపై చూపించేందుకు నిర్మాతలు సాహసించకపోవచ్చు. భవిష్యత్తులో కథల్ని సినిమాలు, ఓటీటీలు కలిసి పంచుకోవాల్సి రావొచ్చు. నా వరకైతే 'వి' కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన చిత్రం.
'వి' కథ.. పవన్ కల్యాణ్, మహేష్‌బాబులను దృష్టిలో పెట్టుకొని సిద్ధం చేశారని అంటున్నారు?
అదేం లేదు. ఓ సారి సుధీర్‌తో మాట్లాడుతూ క్యాజువల్‌గా అన్నా. "ఇది పవన్ కల్యాణ్, మహేష్‌బాబు చేస్తే ఎలా ఉంటుంది?" అని. అంతే తప్ప.. నిజంగా వాళ్ల కోసం సిద్ధం చేసింది కాదు.
నానిలోని విలనిజాన్ని తెరపై ఆవిష్కరించడానికి ఇష్టపడుతున్నట్లున్నారు?
అలాంటిదేం లేదు(నవ్వుతూ). మిగతా హీరోల కంటే నాని ఎక్కువ రిస్క్ తీసుకుంటుంటారు. అందుకే నాకు అతనితో సౌకర్యంగా ఉంటుంది. 'వి' కథ చెప్పి నువ్వు విలన్ అయితే బాగుంటుంది అన్నా. "నాకు అదే చేయాలనుంది" అని అన్నాడు. అలాగే సుధీర్ పాత్రలో తనని తప్ప మరొకరిని చూడలేం.
విజయ్ దేవరకొండ, నాగచైతన్యలకు కథలు సిద్ధం చేశారట!
విజయ్, చైతన్యలతో సినిమాలు చేసే ఆలోచన ఉంది. దీని గురించి మేం సీరియస్‌గా మాట్లాడుకున్నాం కూడా. నా దగ్గరున్న కథల్లో వాళ్లకేవి బాగా నప్పుతాయన్నది చూసుకున్నా. 'వి' తర్వాత సినిమా ఎవరితో అన్నది ఇప్పుడే చెప్పలేను.
ఇది చూడండి : శిల్పాశెట్టి: అమ్మగా ఫుల్‌టైమ్.. ప్రొఫెషనల్‌గా పార్ట్‌టైమ్