పాట మనసుకు నచ్చితే రాసిందెవరు? పాడిందెవరు? అని చాలామంది ఆరా తీస్తుంటారు. అందుకే క్యాసెట్లు, సీడీలు, డిజిటల్ మాధ్యమాల్లో పాట, సాహిత్యం, సంగీతం, గానం వివరాలు ప్రచురిస్తారు. కొన్ని సందర్భాల్లో సాహిత్యం వివరాల్లో ఇద్దరి రచయితల పేర్లు కనిపిస్తాయి. దాంతో ఆ పాటను ఇద్దరు ఎలా రాస్తారు? అనే సందేహం రావడం సహజం. అలాంటి పరిస్థితి ఎందుకొస్తుందో ఓ సందర్భంలో వివరణ ఇచ్చారు సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్. 'కుమరి 21ఎఫ్' సినిమాలోని 'మేఘాలు లేకున్నా' పాట విషయంలో తనకు ఇదే పరిస్థితి ఎదురైందని చెప్పుకొచ్చారు.
"పాటను పంచుకోవడం అంటే ఇద్దరు రచయితలు కలిసి రాయడం అనుకుంటారు. కానీ అలా జరగదు. పాటను ముందు ఓ రచయితతో రాయిస్తారు. అందులో కొన్ని పదాలు దర్శకుడు, సంగీత దర్శకుడికి నచ్చుతాయి, కొన్ని నచ్చవు. దాంతో ఆ పాట బావుందని చెప్పలేరు, బాలేదు అని అనలేరు. అలా మరొకరితో రాయించి నచ్చిన పదాలు తీసుకుంటారు. 'మేఘాలు లేకున్నా' పాటకు పల్లవి శ్రీమణి రాశారు, చరణం కుదరడం లేదని నన్ను రాయమన్నారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. అలా నేను చరణం రాశాను. అంతేకానీ మీరు చరణం రాయండి, మీరు పల్లవి రాయండి అని ముందే చెప్పరు. కొన్ని సందర్భాల్లో ఇలా జరుగుతుంటుంది"
- అనంత శ్రీరామ్, సినీగేయ రచయిత.
ఇందులో రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తీసిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు.
ఇదీ చూడండి : కెరీర్ డౌన్ అయినప్పుడల్లా.. నేను లాక్‌డౌన్‌లోనే!