తెలుగు రాష్ట్రాల్లో కరోనా రెండో దశ చాలా తీవ్రంగా ఉందని ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దశలో ఎంతో మంది కరోనా బారిన పడి, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన అనుకునే ఆత్మీయులను కోల్పోతుండటం గుండె తరుక్కుపోతుందని వాపోయారు.
కరోనా రెండో దశలో బాధితులు కోలుకోడానికి చాలా సమయం పడుతుందని, అందుకే ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించిందని చిరు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వీడియో విడుదల చేశారు. లాక్డౌన్ సడలింపులోనూ ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటిస్తూ మాస్క్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ పాజిటివ్ అయినా ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. వైరస్ కంటే భయమే ముందు మనల్ని చంపేస్తుందని అన్నారు. లాక్డౌన్లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, రిజిస్ట్రేషన్ చేసుకొని వీలైనప్పుడు తప్పనిసరిగా టీకా తీసుకోవాలని కోరారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ మనల్ని, మన దేశాన్ని కాపాడుకుందామని చిరంజీవి విజ్ఞప్తి చేశారు.