దాదాపు తొమ్మిది నెలలుగా ఆకలితో ఉన్న అభిమానులకు మాస్ మహారాజా రవితేజ 'క్రాక్'తో విందుభోజనం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 'షూర్ షాట్.. నో డౌట్.. పుచ్చ పేలిపోద్ది' అంటూ ఇప్పటికే ఆయన సిగ్నల్స్ ఇచ్చారు కూడా. సంక్రాంతి కానుకగా జనవరి 9న 'క్రాక్' విడుదల కానుంది. ఈ చిత్రానికి మాస్ చిత్రాల స్పెషలిస్టు గోపీచంద్ మలినేని దర్శకుడు. శ్రుతిహాసన్ కథనాయిక. సముద్రఖని, వరలక్ష్మీశరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు. బుధవారం సాయంత్రం 'క్రాక్' ప్రిరిలీజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు రవితేజ, గోపీచంద్ మలినేని.
'నాకు సినిమా లైఫ్ ఇచ్చింది రవితేజ. ఆయనతో 'డాన్‌శీను', 'బలుపు' తీశాను. ఇప్పుడు 'క్రాక్'. రవితేజ గారి దగ్గర్నుంచి అభిమానులు ఏం ఆశిస్తున్నారో అది కచ్చితంగా ఈ సినిమాలో ఉంటుంది. ట్రైలర్‌లో చెప్పినట్లు.. సినిమా విజయం సాధించడం ‘షూర్ షాట్.. నో డౌట్’. ఆయనతో మూడో సినిమా చేయడానికి ప్రధాన కారణం మంచి కథ. ఒంగోలులో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తీశాం. ఈ సినిమాలోని క్యారెక్టర్లన్నీ నిజ జీవితంలో ఉన్నవే. మీరంతా నా నుంచి ఒక మంచి సినిమా కోరుకుంటున్నారన్న విషయం నాకు తెలుసు. మీమెంతో కసితో తీసిన సినిమా ఇది. మా బావ తమన్‌తో ఇది ఐదో సినిమా. మంచి సంగీతం ఇచ్చారు. మిగిలిన విషయాలన్నీ సక్సెస్ మీట్‌లో మాట్లాడతాను' అని దర్శకుడు గోపీచంద్ అన్నారు.
'ఈ సినిమా పాటలు బాగా హిట్ అయ్యాయి. కాసర్ల శ్యామ్.. రామజోగయ్య గారు మంచి పాటలు రాశారు. సముద్రకనితో 'శంభోశివశంభో' చేశాను. ఆయనలో మంచి గుణం ఏంటంటే. ఆయన నటిస్తూనే ఉన్నా రాయడం మాత్రం ఆపలేదు. బుర్రసాయిమాధవ్, వివేక్, వంశీ, సుధాకర్, కత్తి మహేశ్.. అందరూ బాగా చేశారు. ప్రత్యేక పాట చేసిన అప్సర కూడా బాగా చేసింది. తెర వెనక పనిచేసిన జేకే.విష్ణుతో పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఫైట్ మాస్టర్లు రామ్‌లక్ష్మణ్.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాతో కలిసి ఎన్నో సినిమాలకు పని చేశారు వాళ్లు. ఆలీ.. నేను కలిసి తీసిన సినిమాలన్నీ హిట్టు కొట్టినవే. తమన్ ఎప్పటిలాగే మంచి సంగీతం ఇచ్చాడు. ఇక డైరెక్టర్ గురించి చెప్పాలంటే.. చాలా కష్టపడ్డాడు. హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. మా కాంబినేషన్ ఇలా కొనసాగాలని కోరుకుంటున్నాను. నిర్మాతలు అమ్మిరాజు, మధు గారికి బాగా డబ్బు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. శృతిహాసన్‌తో నాకు ఇది రెండో సినిమా. గోపీగారు చెప్పినట్లు మిగిలిన విషయాలు సక్సెస్‌మీట్‌లో మాట్లాడుకుందాం' అని రవితేజ ముగించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">