పవర్ ఫుల్ నటన.. కేర్ లెస్ ఆటిట్యూడ్.. యూత్ ఫుల్ ఎనర్జీ.. తెరపై కనిపించిన ప్రతిసారీ పరిగెత్తే పాదరసం.. ఒక్క చోట కుదురుగా ఉండలేని నైజం.. వెరసి రవి శంకర్ రాజు భూపతిరాజు. కుర్రకారు మెచ్చే టాలీవుడ్ హీరో. పక్కా మాస్ చిత్రాల నాయకుడు. రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న రవి శంకర్ రాజు భూపతిరాజు.. ఎవరా? అని అంతగా ఆలోచించక్కర్లేదు. రవితేజ అనే నాలుగక్షరాల్లో ఇమిడిపోయిన ఎనర్జిటిక్ స్టార్. మరో మాటలో చెప్పాలంటే మాస్ మహారాజా. తొలినాళ్లలో చిన్న చిన్న పాత్రల్లో మెరిసి సహాయ దర్శకుడిగా తెరవెనుక పనిచేసి.. అనంతరం వెండితెరపై హీరోగా తళుక్కుమని.. తన హవా ఇప్పటికీ కొనసాగిస్తూ ఎందరో అభిమానుల్ని పొందిన రవితేజ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బాల్యమంతా ఉత్తరాదిలోనే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో రవితేజ 1968 జనవరి 26న రవితేజ పుట్టారు. అసలు పేరు రవి శంకర్ రాజు భూపతిరాజు. తండ్రి రాజ్ గోపాల్ రాజు ఫార్మసిస్ట్‌గా పని చేసేవారు. తల్లి రాజ్యలక్ష్మి భూపతిరాజు గృహిణి. ముగ్గురు కొడుకులలో రవితేజ పెద్దవారు. తండ్రి పని రీత్యా తరుచూ పలు ప్రాంతాలకు మారడం వలన రవితేజ బాల్యం ఎక్కువగా ఉత్తర భారతదేశంలో గడిచింది. తెలుగు, హిందీ భాషలలో అనర్గళంగా మాట్లాడే రవితేజ.. విద్యాభ్యాసం జైపుర్, దిల్లీ, ముంబయి, భోపాల్‌ల్లో జరిగింది. తర్వాత విజయవాడకు వీరి కుటుంబం మారింది. 1988లో సినిమాల్లో కెరీర్‌ను మొదలుపెట్టాలన్న ఉద్దేశంతో చెన్నైకి వెళ్లారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
చిన్న పాత్రల్లో మెరిసి
చెన్నైలో రవితేజ ఉండే గదిలోనే ప్రముఖ దర్శకులు వైవీఎస్ చౌదరి, గుణశేఖర్ ఉండేవారు. 'కర్తవ్యం', 'చైతన్య', 'ఆజ్ కా గూండా రాజ్' ('గ్యాంగ్ లీడర్' హిందీ రీమేక్)లో చిన్న చిన్న పాత్రలు పోషించారు రవితేజ. ఒక పక్క నటిస్తూనే మరో పక్క సహాయ దర్శకుడిగా, బుల్లితెరకూ పని చేసేవారు రవి. సహాయ దర్శకుడిగా బాలీవుడ్, టాలీవుడ్లో ఎన్నో ప్రాజెక్టులకు వర్క్ చేశారు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'నిన్నే పెళ్లాడతా' సినిమాకూ సహాయ దర్శకుడిగా చేశారు. అందులోని ఓ చిన్న పాత్రలోనూ నటించారు.
'సింధూరం'లో కీలకపాత్ర
1997లో సహాయ దర్శకుడిగా వర్క్ చేస్తున్నప్పుడు రవితేజకు, కృష్ణవంశీ 'సింధూరం'లో ప్రధాన పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత 'సీతారామరాజు', 'పాడుతా తీయగా', 'మనసిచ్చి చూడు', 'ప్రేమకు వేళయెరా' చిత్రాల్లో నటించే అవకాశాలు రవితేజాను వరించాయి. 1999లో రవితేజ ప్రధాన పాత్రలో శ్రీను వైట్ల దర్శకత్వంలో 'నీ కోసం' సినిమా రూపుదిద్దుకొంది. ఆ తరువాత 'సముద్రం', 'అన్నయ్య', 'బడ్జెట్ పద్మనాభం' సినిమాల్లో ప్రాధాన్యమున్న పాత్రలు పోషించారు. 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి', 'తిరుమల తిరుపతి వెంకటేశ', 'సకుటుంబ సపరివారసమేతం', 'అమ్మాయి కోసం' వంటి మల్టీస్టారర్‌ల్లోనూ నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కమర్షియల్ సక్సెస్
2001లో పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం'లో హీరోగా నటించారు రవితేజ. ఈ చిత్రం కమర్షియల్‌గా హిట్ అయింది. అక్కడి నుంచి రవితేజ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 2002లో వంశీ దర్శకత్వంలో 'ఔను.. వాళ్లిద్దరు ఇష్టపడ్డారు' విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద విజయమందుకొన్న ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలూ అందుకున్నారు రవితేజ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇడియట్' బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇందులో రవితేజ పెర్ఫార్మన్స్, డైలాగ్ డెలివరీకి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.
పూరీ చిత్రాల హీరో
2002లోనే కృష్ణవంశీ 'ఖడ్గం' సినిమా విడుదల అయింది. భారీ విజయం అందుకొంది. ఇందులో నటుడు కావాలనుకునే ఓ యువకుడి పాత్రలో అలరించారు రవితేజ. 2003లో 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' కోసం పూరీ జగన్నాథ్‌తో మళ్లీ కలిసి పనిచేశారు రవితేజ. ఈ చిత్రంలోని రవితేజ నటనకు ఎన్నో ప్రశంసలు లభించాయి.
2004లో శ్రీనువైట్ల-రవితేజ కాంబినేషన్‌లో 'వెంకీ' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ హాఫ్‌లో రవితేజ కామెడీ ఎంతో బాగుందని, అద్దం ముందు తనకు తాను శాపాలు పెట్టుకునే సన్నివేశాలలో రవితేజ ఎంతో బాగా నటించారని రివ్యూలు వచ్చాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అత్యధిక వసూళ్ల చిత్రం 'విక్రమార్కుడు'
2006లో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన 'విక్రమార్కుడు'లో రవితేజ నటించారు. అప్పటి వరకు రవితేజ నటించిన సినిమాల్లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఇది నిలిచింది. అత్తిలి సత్తిబాబు, విక్రమ్ రాఠోడ్ పాత్రల్లో ఎంతో వైవిధ్యభరితమైన నటన కనబరిచారీ హీరో. 'జింతాత' మ్యానరిజమ్‌ను రవితేజ ఎంతో చక్కగా కనబరిచారడని ప్రశంసలు వచ్చాయి.
అదే ఏడాది 'ఖతర్నాక్'లో నటించారు రవితేజ. 2007లో 'దుబాయ్ శీను' కోసం మూడోసారి శ్రీనువైట్లతో కలిసి పనిచేశారు. 2008లో 'కృష్ణ'లో కామెడీతో అలరించారు. అదే ఏడాది 'నేనింతే' కోసం రవితేజ, పూరీ జగన్నాథ్ మళ్లీ కలిసి వర్క్ చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
దర్శకుల హీరో
2009లో డైరెక్టర్ సురేందర్ రెడ్డితో 'కిక్' సినిమా కోసం వర్క్ చేశారు రవితేజ. అదే ఏడాది 'ఆంజనేయులు' సినిమాలో రవితేజ కనిపించారు. 2010లో 'శంభో శివ శంభో', 'డాన్ శీను' సినిమాలతో ప్రేక్షకులను పలరించారు.
2011లో విడుదలయిన మొదటి రవితేజ సినిమా 'మిరపకాయ్'. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన 'దొంగల ముఠా'లో నటించారు. రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన 'కథ స్కీన్ర్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు' సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు. ఆ ఏడాది రవితేజ చివరి సినిమా రమేష్ వర్మ దర్శకత్వం వహించిన 'వీర'. ఈ సినిమా తరువాత రవితేజకు 'మాస్ మహారాజ' ఇమేజ్ వచ్చింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తర్వాత 'నిప్పు', 'దేవుడు చేసిన మనుషులు', 'సారొచ్చారు' వంటి చిత్రాలు చేసిన సరైన ఫలితం దక్కలేదు. తర్వాత గోపీచంద్ మలినేనితో 'బలుపు' చేసి బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకున్నారు రవితేజ. అనంతరం 'పవర్', 'కిక్ 2', 'బెంగాల్ టైగర్' వంటి చిత్రాలతో అలరించారు. ఓ ఏడాది విరామం తర్వాత 'టచ్ చేసి చూడు', 'రాజా ది గ్రేట్', 'అమర్ అక్బర్ ఆంటోనీ', 'డిస్కోరాజా' సినిమాల్లో మెప్పించారు. తాజాగా గోపీచంద్ మలినేనితో చేసిన 'క్రాక్' సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. మాస్ ప్రేక్షకుల నీరాజనాలందుకుంటూ దూసుకెళ్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పురస్కారాలు
'నీ కోసం', 'ఖడ్గం' సినిమాలకు నంది స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని అందుకున్నారు రవితేజ. 'నేనింతే' చిత్రంలోని పాత్రకు ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని దక్కించుకున్నారు.
అతిథి పాత్రల్లో
రవితేజ అతిథి పాత్రల్లోనూ నటించి ప్రేక్షకులను అలరించారు. 'శంకర్ దాదా జిందాబాద్', 'కథ స్కీన్ర్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు', 'రోమియో', 'దొంగాట' చిత్రాల్లో తళుక్కుమని ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.
గాయకుడిగా
'పవర్' చిత్రంలోని 'నోటంకి నోటంకి' పాటను ఆలపించారు రవితేజ. అలాగే 'రాజా ది గ్రేట్' చిత్రంలో 'రాజా ది గ్రేట్' పాటకు గొంతు అందించారు. 'బలుపు'లోనూ ఓ పాటను పాడారు. 'మర్యాద రామన్న', 'దూసుకెళ్తా', 'అ' సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు రవితేజ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వివాహం
రవితేజ భార్య పేరు కళ్యాణి. వీరి వివాహం 2000వ సంవత్సరంలో జరిగింది. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.