మాకు తగిన కథలే సిద్ధం కావడం లేదని సీనియర్ హీరోలు.. కథలైతే వింటున్నాం కానీ వాటిలో కొత్తదనం లేదని యువ హీరోలు తరచూ చేసే ఫిర్యాదు. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఇలాంటి ఫిర్యాదులేమీ వినిపించడం లేదు. విన్నోళ్లకు విన్నన్ని కథలు. ఒప్పుకోవాలే కానీ చేతినిండా సినిమాలే.
విజయాలతో ఉన్న దర్శకులు సైతం హీరోల కోసం కాచుకు కూర్చున్నారు. కరోనాతో చిత్రీకరణలు ఆగిపోవడం.. హీరోలకి కథలు వినేందుకు మరింత తీరిక దొరకడం.. ఎలాంటి ఒత్తిడి లేకుండా రాసుకునేందుకు దర్శకులకూ కావల్సినంత సమయం లభిస్తుండడం వల్ల కథల జోరు కనిపిస్తోంది.
అగ్ర తార, యువ తార అని లేకుండా.. అందరి దగ్గరా కథలకి సంబంధించిన జాబితా దర్శనమిస్తోంది. రాబోయే కొన్నేళ్ల వరకు కథలు లేవనే మాట ఏ హీరో నోటి నుంచీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
నచ్చితే బరిలోకి దిగడమే..
కొన్నేళ్లుగా యువతరం కెప్టెన్లు సత్తా చాటుతున్నారు. వినూత్నమైన కథల్ని సిద్ధం చేస్తూ హీరోల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. మరోపక్క పొరుగు కథలపైనా మనసుపడి వాటిని దిగుమతి చేసుకుంటున్నారు నిర్మాతలు. అయినా సరే.. కొందరు హీరోలు వాళ్లకి తగ్గ కథల కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. ఒక సినిమా చేస్తుండగానే కొత్తగా రెండు మూడు కథల్ని పక్కా చేసి పెట్టుకునే హీరోలు సైతం ఆగిపోవల్సిన పరిస్థితులు తలెత్తేవి. ఇప్పుడు మాత్రం సీన్ మారింది. చేస్తున్న సినిమా పూర్తయితే కానీ మరో సినిమా గురించి ఆలోచించని హీరోల ముందు కూడా ఇప్పుడు కావల్సినన్ని కథలున్నాయి. ఎప్పుడు ఏది నచ్చితే దాంతో రంగంలోకి దిగడమే.
విరివిగా...
యువతరానికైతే ప్రేమకథలో, ట్రెండీ కథలో ఉంటాయి కానీ, సీనియర్ హీరోలకి కథలంటే మాత్రం చాలా కష్టమనేవాళ్లు ఇదివరకు. అందుకే ఆ హీరోలు పొరుగు కథలపైనే ఎక్కువగా దృష్టి పెట్టేవాళ్లు. ఇప్పుడు వాళ్ల కోసమూ విరివిగా స్టోరీలు సిద్ధమవుతున్నాయి. వీటికి తోడు రీమేక్ కథలూ ఉన్నాయి. దాంతో సీనియర్ల దగ్గరా బోలెడన్ని కథలు కనిపిస్తున్నాయి.
తరచూ రీమేక్ స్టోరీలతో సందడి చేసే విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం 'నారప్ప'లో నటిస్తున్నారు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలోనూ, అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్-3' సినిమాలు చేయబోతున్నారు. త్రివిక్రమ్ కూడా వెంకీ కోసం కథ సిద్ధం చేసినట్టు ఎప్పట్నుంచో ప్రచారం సాగుతోంది. వీటితోపాటు మరికొన్ని రీమేక్‌లూ వెంకీ కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం 'ఆచార్య'లో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి కోసం చాలా కథలు సిద్ధంగా ఉన్నాయి. బాబీ, మెహర్ రమేశ్, సుజీత్ తదితరులు కథలు సిద్ధం చేస్తున్నారు. వినాయక్ దర్శకత్వంలోనూ ఓ సినిమా ఉంటుందని సమాచారం.
బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత సినిమాల కోసం సంగీతం శ్రీనివాసరావు, అనిల్ రావిపూడి తదితర దర్శకులు కథలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
మరో సీనియర్ హీరో నాగార్జున 'వైల్డ్‌డాగ్'లో నటిస్తున్నారు. ఆ తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలోనూ 'బంగార్రాజు' చేయబోతున్నారు.
మోహన్‌బాబు ఇటీవలే 'సన్నాఫ్ ఇండియా' కథకి పచ్చజెండా ఊపారు. ఇలా సీనియర్లకోసం కథలు సిద్ధం అవుతుండడం వల్ల వాళ్లంతా ఉత్సాహంగా రంగంలోకి దిగేందుకు సన్నద్ధమయ్యారు. పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్‌ల కథలూ పక్కా కావడం వల్ల విరామం లేకుండా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఒక్కొక్కరికీ ఐదు
జయాపజయాలతో సంబంధం లేకుండా వేగంగా సినిమాలు చేస్తుంటారు రవితేజ. ఇప్పుడూ ఆయన అదే పంథాని కొనసాగిస్తున్నారు. 'క్రాక్'లో నటిస్తున్న రవితేజ దాంతోపాటు కొత్తగా నాలుగు కథల్ని ఓకే చేసేశారు. రమేష్ వర్మ, వక్కంతం వంశీ, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సినిమాలు చేయడానికి ఒప్పుకున్నారు.
వీటితోపాటు 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌లోనూ నటించబోతున్నారు. నాని చేతిలోనూ ఐదు సినిమాలున్నాయి. 'టక్ జగదీష్'లో నటిస్తున్న ఆయన తదుపరి 'శ్యామ్ సింగరాయ్' కోసం రంగంలోకి దిగబోతున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలోనూ, శ్రీకాంత్ అనే మరో కొత్త దర్శకుడితోనూ సినిమాలు చేయబోతున్నారు. వీటితోపాటు మరో చిత్రమూ చర్చల దశలో ఉందట.
యువ కథానాయకుడు నితిన్ చేయాల్సిన కథలూ చాలానే ఉన్నాయి. 'రంగ్‌దే'లో నటిస్తున్న ఆయన ఆ తర్వాత చంద్రశేఖర్ యేలేటి చిత్రం చేస్తారు. మరోపక్క 'అంధాదున్' రీమేక్‌కు కొబ్బరికాయ కొట్టేశారు. కృష్ణచైతన్య దర్శకత్వంలో 'పవర్ పేట' అనే సినిమా చేయబోతున్నారు.
నాగచైతన్య 'లవ్‌స్టోరీ' తర్వాత విక్రమ్ కె.కుమార్, మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సినిమాల కోసం రంగం సిద్ధమైంది. విజయ్ దేవరకొండ, శర్వానంద్, రానా.. ఇలా వీళ్లందరి చేతుల్లోనూ కొత్త కథలున్నాయి. ప్రత్యేకంగా వాటి గురించి ఆలోచించకుండా ప్రయాణం చేసే అవకాశం ఉంది.