అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ కనుక ఈసారి 'మా' అధ్యక్షుడైతే తాను ఎంతో సంతోషిస్తానని నటుడు మంచు విష్ణు అన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో(MAA elections 2021) అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న విష్ణు తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలందరూ కలిసి ఏకగ్రీవంగా ఎవరినైనా అధ్యక్షుడిగా ఎన్నుకుంటే తప్పకుండా తాను 'మా' ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానన్నారు విష్ణు. అలాగే 'మా' శాశ్వత భవన నిర్మాణం పట్ల తనకున్న ప్లానింగ్ చెప్పాలంటూ ఇటీవల నాగబాబు వేసిన ప్రశ్నకు విష్ణు సమాధానమిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులతో తనకి మంచి అనుబంధాలున్నాయని అన్నారు.
"కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, సత్యనారాయణ, కోటశ్రీనివాసరావు, బ్రహ్మానందం, జయసుధ.. ఇలా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పెద్దలందరూ కలిసి ఏకగీవ్రంగా 'మా' అధ్యక్షుడిని ఎన్నుకుంటే తప్పకుండా నేను ఈ ఏడాది ఎన్నికల బరి నుంచి తప్పుకుంటా. అలా కాని పక్షంలో ఎన్నికల్లో పోటీ చేసి తీరతా. వాళ్లు ఏకగీవ్రంగా ఎవర్ని ఎన్నుకున్నా నాకు ఓకే. బాలయ్య నాకు సోదరుడు లాంటి వ్యక్తి. ఒకవేళ ఆయన్నే కనుక ఈసారి అధ్యక్షుడిగా ఎన్నుకుంటే నేను ఎంతో ఆనందిస్తా. ఆయన అధ్యక్షుడు అయితే అందరికీ మంచి జరుగుతుంది. బాలయ్య మాత్రమే కాదు.. ఆయన జనరేషన్‌కు చెందిన కొంతమంది నటీనటులు అప్పట్లో 'మా' ఎన్నికల్లో నిలబడలేదు. వాళ్లల్లో అధ్యక్షుడిగా ఎవరైనా నాకు ఆనందమే. కాకపోతే అసోసియేషన్ కోసం వాళ్లు ప్రత్యేకంగా సమయం కేటాయించడం అంత సులభంగా జరగకపోవచ్చు."
అనంతరం నాగబాబు కామెంట్‌పై స్పందిస్తూ.. "నాగబాబు నాకు తండ్రిలాంటి వ్యక్తి. ఆయనంటే నాకెంతో ఇష్టం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'మా' భవన నిర్మాణంలో నా ప్లానింగ్ గురించి అడిగారు. సరైన సమయం వచ్చినప్పుడు అందరికీ సమాధానం చెబుతా. రెండు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులతో నాకు మంచి అనుబంధం ఉంది. వాళ్లతో మాట్లాడి.. 'మా'కు కావాల్సిన భూమిని సంపాదించుకోగలననే నమ్మకం ఉంది" అని విష్ణు వివరించారు.