ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్'. రాధా కృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. ఈ సందర్భంగా సెట్లో తమిళ నటుడు జయరామ్-ప్రభాస్ కలిసి ఓ సెల్ఫీ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో ప్రభాస్ చాలా స్మార్ట్‌గా కనిపిస్తున్నారు. ఇక జయరామ్ కూడా మీసాలు పెంచి అదరహో అనిపించేటట్లు ఉన్నారు.
మలయాళ నటుడు జయరాం తెలుగులో 'భాగమతి','అల వైకుంఠాపురములో' వంటి చిత్రాలలో నటించి అలరించారు. యూరోపియన్ ప్రేమకథా నేపథ్యంలో పీరియడ్ లవ్ స్టోరీగా వస్తున్న 'రాధేశ్యామ్' చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. సినిమాలో ప్రభాస్ ఫార్చ్యూన్ టెల్లర్ పాత్రను పోషిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. పూజా హెగ్డే ఒక యువరాణి పాత్రలో అలరించనుందని చెప్పుకుంటున్నారు. ఇక జయరామ్ సైతం చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. కానీ అది ఎలాంటి పాత్ర అనేది తెలియదు. సినిమాలో భాగ్యశ్రీ, ప్రియదర్శి పులికొండ, మురళీశర్మ, కునాల్ రాయ్ కపూర్ తదితరులు నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు.