Adivi Sesh Major: అడివి శేష్ కథానాయకుడిగా శశి కిరణ్ తిక్కా తెరకెక్కిస్తున్న బహుభాషా చిత్రం 'మేజర్'(Major) విడుదల వాయిదా పడింది. ముంబయి 26/11 ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా రూపొందిన ఈ సినిమాను ఫిబ్రవరి 11న విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించింది. కాగా, ప్రస్తుతం కరోనా మూడోదశ వ్యాప్తి ఉన్న నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. దీంతో పలు సినిమాలు విడుదల వాయిదా వేసుకున్నాయి. ఇప్పుడదే బాటలో 'మేజర్' కూడా పయనించింది. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది. అప్పటివరకూ ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరింది.
'మేజర్' కోసం యూనిట్ ఎంతో కష్టపడింది. ఈ సినిమా కోసం ఎనిమిది ప్రత్యేక సెట్లు వేసి, 75లొకేషన్లలో చిత్రీకరణ జరిపారు. 120రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. శోభిత ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్ కథా నాయికలుగా నటిస్తున్న 'మేజర్'లో ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం శ్రీచరణ్ పాకాల, ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు.
mahan, malli modalaindi ott release: తమిళంతో పాటు, తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విక్రమ్. తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కూడా ఆయన కథల ఎంపిక ఉంటుంది. తనయుడు ధ్రువ్ విక్రమ్‌తో కలిసి ఆయన నటించిన తాజా చిత్రం 'మహాన్'. కార్తీక్ సుబ్బరాజు దర్శకుడు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం కరోనా థర్డ్‌వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ప్రైమ్ వేదికగా 'మహాన్'ను విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్.ఎస్.లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణ మ్యూజిక్ డైరెక్టర్. బాబీ సింహా, సిమ్రన్, సంతానం తదితరులు కీలక పాత్రలు పోషించారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన గత రెండు చిత్రాలు 'జగమే తంత్రం', 'నవరస: పీస్' ఓటీటీలోనే విడుదల కావటం గమనార్హం.
Malli Modalaindi: ఓటీటీలో 'మళ్లీ మొదలైంది'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సుమంత్ హీరోగా టీజీ కీర్తి కుమార్ తెరకెక్కించిన చిత్రం 'మళ్లీ మొదలైంది'. రాజశేఖర్ రెడ్డి నిర్మాత. వర్షిణీ సౌందర్ రాజన్, నైనా గంగూలి కథానాయికలు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. త్వరలో ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ5'లో నేరుగా విడుదల కానుంది. ఇటీవల ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కాగా, ఇప్పుడు స్ట్రీమింగ్ తేదీని కూడా వెల్లడించింది. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి 'మళ్లీ మొదలైంది' జీ5లో అందుబాటులో ఉంటుందని తెలిపింది. ''విడాకులు తీసుకున్న ఓ యువకుడు.. తన న్యాయవాదితో ప్రేమలో పడితే ఏం జరిగింది? అన్నదే ఈ చిత్ర కథాంశం. ఇందులో సుమంత్ భార్యగా వర్షిణీ కనిపించనుండగా.. న్యాయవాది పాత్రను నైనా గంగూలి పోషించింది. సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: శివ.
జై భీమ్‌కు మరో మూడు అవార్డులు..
సూర్య నటించిన 'జైభీమ్' చిత్రం మరోసారి వార్తాల్లో నిలిచింది. 9వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఏకంగా మూడు అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ కథానాయకుడు, ఉత్తమ హీరోయిన్ అవార్డులను కూడా గెలుచుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
హనుమంతుగా తేజా సజ్జ..
యువ హీరో తేజా సజ్జ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా పేరు హనుమ్యాన్. అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ నేడు హైదరాబాద్‌లో ప్రారంభమైనట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో హనుమంతుగా తేజా నటిస్తుండగా.. మీనాక్షి పాత్రలో అమృత అయ్యార్ కనిపించనుంది. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: 'ఆర్ఆర్ఆర్' బ్యానర్లో ప్రభాస్ కొత్త సినిమా!