తెలుగు నటీనటుల సంఘం అధ్యక్ష ఎన్నికల్లో(MAA Elections 2021) అభ్యర్థుల మధ్య వాతావరణం మరింత వేడెక్కింది. వ్యక్తిగత విమర్శలకు తోడు కుటుంబ సభ్యుల ప్రస్తావన తెస్తూ 'మా' ఎన్నికలను తారస్థాయికి చేర్చారు. ఈ క్రమంలో మంచు విష్ణు 'మా' ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ల దుర్వినియోగం చేస్తున్నారని(MAA Elections Controversy) ఆరోపిస్తూ ప్రకాశ్ రాజ్ 'మా' ఎన్నికల సహాయ అధికారి నారాయణరావుకు ఫిర్యాదు చేశారు. జీవిత, శ్రీకాంత్ సహా తన ప్యానల్ సభ్యులతో కలిసి 'మా' కార్యాలయానికి వచ్చిన ప్రకాశ్ రాజ్.. పోస్టల్ బ్యాలెట్ విషయంలో విష్ణుపై ఫిర్యాదు చేశారు. అగంతకులతో 'మా' ఎన్నికలు నిర్వహిస్తారా? అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. ఈ విషయంలో కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున జోక్యం చేసుకొని సమాధానం చెప్పాలని కోరారు. చెన్నై, వైజాగ్ సహా దూర ప్రాంతాల్లో ఉన్న నటీనటుల చేత సంతకాలు సేకరిస్తున్నారని భావోద్వేగానికి గురైన ప్రకాశ్ రాజ్.. 'మా' ఎన్నికల అధికారి నిబంధనల ప్రకారం విష్ణుపై చర్యలు తీసుకోవాలని కోరారు.
విష్ణు అభ్యంతరం
ప్రకాశ్ రాజ్ ఆరోపణలపై స్పందించిన మంచు విష్ణు.. పోస్టల్ బ్యాలెట్ విషయంలో తాను లీగల్ గానే వెళ్లాలనని స్పష్టం చేశారు. ఒక కుటుంబం లాగా భావించే 'మా' అసోసియేషన్‌ను ప్రకాశ్ రాజ్ విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కృష్ణ, కృష్ణంరాజుల పేర్లు ప్రస్తావిస్తూ వాళ్లను అవమానించారని ధ్వజమెత్తారు. తన కుటుంబసభ్యుల ప్రస్తావన తీసుకొస్తూ ప్రకాశ్ రాజ్ మాట్లాడటంపై అభ్యంతరం వ్యక్తం చేసిన మంచు విష్ణు.. మరోసారి అలా మాట్లాడి తనపై ఉన్న గౌరవాన్ని పొగొట్టుకోకూడదని హెచ్చరించారు. అక్టోబర్ 10న జరిగే ఎన్నికలను ఈవీఎంల ద్వారా నిర్వహిస్తే ప్రకాశ్ రాజ్ తన పలుకుపడితో ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉన్నందున పేపర్ బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని ఎన్నికల అధికారికి లేఖ రాశానని మంచు విష్ణు వెల్లడించారు.
జీవిత.. అది నేరం..
అలాగే ప్రకాశ్ రాజ్ ప్యానల్లో ఉన్న జీవిత, శ్రీకాంత్‌లపై మంచు విష్ణు మండిపడ్డారు. మోహన్ బాబు పేరు ప్రస్తావించే అర్హత జీవితకు లేదని ఆగ్రహించిన విష్ణు.. ఓటు వేయడానికి రావద్దని జీవిత సభ్యులకు చెప్పడం నేరమవుతుందన్నారు. తన కోసం తన కుటుంబం ఓటు అగడంలో ఎలాంటి తప్పులేదని పేర్కొన్న విష్ణు.. అక్టోబర్ 11 తర్వాత ప్రకాశ్ రాజ్ హైదరాబాద్ విడిచి వెళ్లిపోతారని విమర్శించారు.
మంచు విష్ణుకు మద్దతుగా నిలుస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పూర్వ అధ్యక్షుడు నరేష్ కూడా ప్రకాశ్ రాజ్‌పై పలు విమర్శలు చేశారు. మతిస్థిమితం లేని వ్యక్తికి 'మా' ఎన్నికలు ఎందుకంటూ ప్రశ్నించారు.
పోస్టల్ బ్యాలెట్ విధానంలో..
మరోవైపు అక్టోబర్ 10న జరగనున్న మా ఎన్నికలపై దృష్టి సారించిన ఎన్నిక అధికారి కృష్ణమోహన్.. ఈసారి పోలింగ్ ను పేపర్ బ్యాలెట్ విధానంలోనే జరపాలని నిర్ణయించారు. విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్రతిపాదనలను క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజు దృష్టికి తీసుకెళ్లిన ఎన్నికల అధికారి.. 2019లో సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా అక్టోబర్ 10న జరిగే ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే జరపాలని తుది నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చూడండి.. MAA Elections 2021: పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలోనే 'మా' ఎన్నికలు