లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి 13 ఏళ్ల విరామం తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం కోసం మళ్లీ మేకప్ వేసుకుంది. ఆమె రీఎంట్రీతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మళ్లీ ఆమెను వెండితెరపై చూడొచ్చని అభిమానులు ఆనందపడ్డారు. అందుకు తగ్గట్టే ఈ నెల 11న వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో ఆమె పవర్‌ఫుల్ పాత్రలో కనిపించింది. అయితే ఈ సినిమాలో నటించేందుకు విజయశాంతి తీసుకున్న పారితోషికంపై టాలీవుడ్‌లో పెద్ద టాక్ నడుస్తోంది. జీఎస్టీతో కలిపి ఆమె రూ.1.5 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో కథానాయిక రష్మిక అందుకున్న పారితోషకం కంటే ఇది ఎక్కువని అంటున్నారు. మరి ఇందులో ఏ మాత్రం నిజం ఉందో తెలియాలంటే నిర్మాతలు స్పందించాల్సిందే.
ఇదీ చూడండి: హీరోయిన్ రష్మిక ఇంట్లో ఐటీ సోదాలు.. పారితోషికమే కారణమా!
రాజకీయాలతో పాటు నటనను కొనసాగించాలనే ఉద్దేశంలో విజయశాంతి ఉంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ సాధారణ పాత్రల్లో నటించనని, పవర్‌ఫుల్ రోల్స్ వస్తేనే చేస్తానని తెలిపింది.
హిట్ కాంబినేషన్...
కృష్ణ కథానాయకుడిగా, విజయశాంతి హీరోయిన్‌గా పలు చిత్రాలు తెరకెక్కాయి. అందులో 'కొడుకు దిద్దిన కాపురం' కూడా ఒకటి. ఈ సినిమాలో ప్రిన్స్ మహేశ్‌బాబు నటించాడు. దాదాపు 30 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి 'సరిలేరు నీకెవ్వరు'లో నటించారు. మహేశ్ ఇందులో ఆర్మీ అధికారి అజయ్‌కృష్ణగా కనిపించాడు. అనిల్ రావిపూడి దర్శకుడు. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబు నిర్మించారు.
ఇదీ చూడండి... 13 ఏళ్ల తర్వాత విజయశాంతి రీఎంట్రీకి కారణమిదే