Lady oriented movies: సాధారణంగా నాయికా ప్రాధాన్య చిత్రాలనగానే సీనియర్ భామలే గుర్తొస్తారు. బోలెడంత అనుభవం, సినీప్రియుల్లో క్రేజ్ సంపాదించిన వారికే అలాంటి అవకాశాలు దక్కుతుంటాయి. అయితే తొలి అడుగుల్లోనే కృతిశెట్టి కోసం అలాంటి ఓ కథ సిద్ధమైనట్లు తెలిసింది. 'ఉప్పెన' సినిమాతో తెలుగు తెరపై ఉవ్వెత్తున ఎగసిపడిన నయా అందాల కెరటం కృతి. ఇటీవలే 'శ్యామ్ సింగరాయ్', 'బంగార్రాజు' చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన ఈ కన్నడ కస్తూరి.. ప్రస్తుతం రామ్ సరసన 'ది వారియర్'లో, నితిన్‌కు జోడీగా 'మాచర్ల నియోజకవర్గం'లో నటిస్తోంది. ఇప్పుడీ అమ్మడి కోసం విరించి వర్మ ఓ నాయికా ప్రాధాన్య కథ సిద్ధం చేసినట్లు సమాచారం. 'ఉయ్యాల జంపాల', 'మజ్ను' సినిమాలతో ఆకట్టుకున్న యువ దర్శకుడాయన. కాస్త విరామం తర్వాత ఇప్పుడు ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడీ చిత్రం కోసమే కృతిని సంప్రదించినట్లు తెలిసింది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, ఈ సినిమా చేసేందుకు కృతిశెట్టి అంగీకారం తెలిపిందని ప్రచారం వినిపిస్తోంది. దీనికి చిరంజీవి తనయ సుస్మిత నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం కృతి, సుధీర్‌బాబు జంటగా నటించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీన్ని మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించారు.
అనుపమ... 'బటర్‌ఫ్లై'
'అఆ' చిత్రంతో తొలి అడుగులోనే తెలుగు వారికి దగ్గరైన మలయాళీ సోయగం అనుపమ పరమేశ్వరన్. 'ఉన్నది ఒకటే జిందగి', 'శతమానం భవతి', 'హలో గురు ప్రేమకోసమే', 'రాక్షసుడు' వంటి విజయవంతమైన చిత్రాలతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే 'రౌడీబాయ్స్'తో పలకరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు నుంచి రానున్న కొత్త సినిమా 'బటర్‌ఫ్లై'. అనుపమ ప్రధాన పాత్రలో నటిస్తున్న తొలి నాయికా ప్రాధాన్య చిత్రమిది. గంటా సతీష్‌బాబు దర్శకుడు. రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటు యువత, అటు కుటుంబ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అనుపమ త్వరలో 'హెలెన్' రీమేక్‌లో నటించనుందని సమాచారం. మలయాళంలో విజయ వంతమైన ఈ నాయికా ప్రాధాన్య చిత్రాన్ని తెలుగులో పీవీపీ బ్యానర్ పునర్నిర్మించనుంది. ప్రస్తుతం అనుపమ, నిఖిల్ కలిసి నటిస్తున్న '18పేజెస్', 'కార్తికేయ 2' సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.
'శాకిని ఢాకిని'తో.. నివేదా
నటనా ప్రాధాన్య పాత్రలతో మెప్పిస్తూ.. కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నివేదా థామస్. ఇప్పుడామె ప్రధాన పాత్రలో నటిస్తున్న తొలి నాయికా ప్రాధాన్య చిత్రం 'శాకిని ఢాకిని'. రెజీనా మరో నాయికగా నటిస్తోంది. సుధీర్ వర్మ దర్శకుడు. సురేష్‌బాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొరియన్ సినిమా 'మిడ్‌నైట్ రన్నర్స్'కు రీమేక్‌గా రూపొందుతోంది. నిజానికి మాతృకలో కథ మొత్తం హీరో పాత్రల చుట్టూనే అల్లుకున్నా.. తెలుగులో లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్‌గా తీర్చిదిద్దారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం.. నివేదా, రెజీనా పలు పోరాట సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించినట్లు తెలిసింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
'ఆద్య'తో తొలిసారి..
నాయికగా.. ప్రతినాయికగా.. సహాయ నటిగా విభిన్నమైన పాత్రలతో అలరించింది వరలక్ష్మి శరత్‌కుమార్. ఇప్పుడామె ప్రధాన పాత్రలో ఎం.ఆర్.కృష్ణ మామిడాల తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆద్య'. రజనీకాంత్, ఎస్.పి.ఎస్.ఆర్. కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆశిష్ గాంధీ, విశ్వ కార్తీక్, హెబ్బా పటేల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వరలక్ష్మి నటిస్తున్న ఈ తొలి నాయికా ప్రాధాన్య చిత్రం.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇందులో ఆమె లుక్, నటన చాలా కొత్తగా ఉండనున్నాయని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకి మణిశర్మ స్వరాలందిస్తున్నారు. డి.శివేంద్ర ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. వరలక్ష్మి ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణ చిత్రంతో పాటు 'యశోద', 'హను-మాన్' సినిమాల్లో నటిస్తోంది.
ఇదీ చూడండి:
'త్వరలోనే తెలుగులోకి 'ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం''
చెర్రీ ఉదారత.. ఉక్రెయిన్‌లోని సెక్యూరిటీ గార్డుకు ఆర్థిక సాయం